కామారెడ్డి/బాన్సువాడ టౌన్, ఆగస్టు 1 : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయనుండడంతో కార్మికులు మంగళవారం సంబురాల్లో మునిగి పోయారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్న సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. డిపోలు, బస్టాండ్లలో కేసీఆర్‌తో పాటు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి, ఎమ్మెల్యేల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అటు బీడీ టేకేదార్లు కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ సంబురాలు జరుపుకొన్నారు.
ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం, బీడీ టేకేదార్లకు పింఛన్ మంజూరు చేసేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోద్ర ముద్ర వేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తమయ్యింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంగళవారం ఆర్టీసీ ఉద్యోగులు, బీడీ టేకేదార్లు సంబురాలు జరుపుకొన్నారు. బస్సు డిపోల వద్ద, ప్రధాన చౌరస్తాల్లో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, వేముల, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమ కష్టాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్.. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపునిస్తున్నారన్నారు.
ఆర్టీసీ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వంలో విలీనం చేసినందుకుగాను కామారెడ్డి బస్ డిపోలో సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ చిత్ర పటాలకు మంగళవారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ లక్కు మల్లేశం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీ ఉద్యోగులను ఆదుకోవడం హర్షణీయమని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం తీసుకోని చారిత్రాత్మక నిర్ణయం సీఎం కేసీఆర్ తీసుకున్నారని అన్నారు. కేసీఆర్‌కు రుణపడి ఉంటామని అన్నారు. అనంతరం పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ లింగమూర్తి, ట్రాఫిక్ సూపర్వైజర్ హరినాథ్, మెకానికల్ ఫోర్‌మెన్ వసుంధర, కార్గో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రాజు, డ్రైవర్లు, కండక్టర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. బాన్సువాడ బస్ డిపోలో ఆర్టీసీ ఉద్యోగులు స్వీట్లు తినిపించుకొని సంబురాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఆర్టీసీ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో బాన్సువాడ బస్ డిపో మేనేజర్ సదాశివ్, అసిస్టెంట్ మేనేజర్ బన్సీలాల్, డిపోలోని అన్ని విభాగాల ఉద్యోగులు పాల్గొన్నారు.
టేకేదారులు..
బీడీ టేకేదార్లకు జీవనభృతి ఇవ్వాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ కామారెడ్డిలోని నిజాంసాగర్ చౌరస్తాలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సీఎం కేసీఆర్ చిత్ర పటానికి మంగళవారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న టేకేదారులకు కేసీఆర్ జీవనభృతి కల్పించడం సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో 80 శాంత మంది బీడీలపై ఆధారపడుతున్నారని, తమ కుటుంబాలను ఆదుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో టేకేదార్ల సంఘం అధ్యక్షుడు బొమ్మెర రాజు, ప్రతినిధులు దాసు, శేఖర్, నారాయణ, భాస్కర్, రాంచంద్రం, స్వామిలు పాల్గొన్నారు.