నిజామాబాద్, అక్టోబర్ 18, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీసీ బంద్ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులను నడిపేందుకు ఆర్టీసీ యాజమాన్యం సిద్ధమవ్వగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో డిపోల ఎదుట ధర్నా కార్యక్రమాలను నిర్వహించారు. తెల్లవారుజామున 5గంటల నుంచే ఆర్టీసీ డిపోల ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీసీ సంఘాల వినతి మేరకు స్వచ్ఛందంగా ప్రైవేటు విద్యా సంస్థలు బంద్‌ను పాటించాయి. ముందస్తుగానే స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటిస్తున్నట్లుగా నిర్ణయం తీసుకున్నారు. వ్యాపార, వాణిజ్య వర్గాలు సైతం సంఘీభావం తెలిపాయి. బీసీల డిమాండ్‌కు అన్ని పార్టీలు మద్దతు ప్రకటిస్తున్నట్లుగా చెప్పాయి. బీఆర్ఎస్ మాత్రం ప్రత్యక్ష ఉద్యమంలో భాగమైంది. కాంగ్రెస్ పార్టీ తూతూ మంత్రంగా పాత్ర వహించింది. బీజేపీ అంటీ ముట్టనట్లుగా బంద్‌లో పాల్గొన్నట్లుగా ప్రజలు భావిస్తున్నారు. బీజేపీ పార్టీకి చెందిన పలువురు బీసీ నేతలైతే కాషాయ కండువాను ధరించకుండా వ్యక్తిగత హోదాలో ధర్నాలో పాల్గొనడం కనిపించింది.
జాతీయ పార్టీల ద్వంద నీతి..
తెలంగాణ ఉద్యమ కాలంలో ద్వంద నీతిని పాటించినట్లుగానే కాంగ్రెస్, బీజేపీలు ఇప్పుడు బీసీ అంశంలోనూ రెండు కళ్ల సిద్ధాంతాన్ని పాటించడంపై బీసీలు మండిపడుతున్నారు. అధికారంలో ఉన్న జాతీయ పార్టీలు వ్యవహరిస్తున్న తీరుపై బీసీలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం వాటా కల్పిస్తామంటూ కాంగ్రెస్ హామీలిచ్చింది. ప్రగల్భాలు పలికి బీసీ జనాలను మోసం చేసింది. అమలుకు నోచుకోని జీవో 9 జారీ చేసి అయోమయంలో పడేసింది. తీరా ఇప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టులో ప్రతికూలత ఎదురు కాగానే కాంగ్రెస్ ప్రభుత్వ తీరు సరైన విధంగా ఉండడం లేదు. ఇచ్చిన మాటపై వెనుకడుగు వేస్తూ బీసీలను మభ్యపెడుతోంది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 42శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉండగా పూటకో తీరుతో తప్పించుకుంటోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ ఈ విషయంపై నోరు మెదపడం లేదు. బీసీ బంద్‌తో ఎక్కడికక్కడ రవాణా స్తంభించింది. బస్సులు తిరగక పోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలా మంది వ్యక్తిగత వాహనాల్లో దూర ప్రాంతాలకు పయనం అయ్యారు. రైల్వే రాకపోకలు యథావిధిగా నడిచాయి.
ఉత్సాహంగా పాల్గొన్న బీఆర్ఎస్ శ్రేణులు..
బీసీ బంద్‌లో గులాబీ జెండా రెపరెపలాడింది. బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఉదయమే బంద్‌లో పాల్గొని బీసీలకు సంఘీభావం తెలిపారు. బీసీ సంఘాలతో ఐక్యంగా ముందడుగు వేసి ర్యాలీలు తీశారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ డిపో ఎదురుగా జరిగిన పలు ధర్నా కార్యక్రమాల్లోనూ బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొని బీసీ సంఘాలకు మద్ధతును తెలియజేశారు. రాజకీయాలకు అతీతంగా బంద్‌లో పాల్గొని సత్తా చాటారు. బీసీ బంద్‌లో అధికార కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న ఇరు పార్టీలు బీసీ రిజర్వేషన్లకు మద్ధతును ఇచ్చి బీసీ సంఘాలతో బైఠాయించడంపై అంతా వీస్తూ పోయారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లను సాధించి పెట్టాల్సిన ఇరు జాతీయ పార్టీలు ఆడుతోన్న ద్వంద నీతిపై సర్వత్రా వ్యతిరేకత వెలుగు చూసింది. సాంకేతికంగా బీసీలకు మద్ధతును తెలియజేసినప్పటికీ ప్రజానీకాన్ని ఇరు పార్టీల నేతల తీరుతో గందరగోళంలో కొట్టుమిట్టాడాల్సి వచ్చింది. బీసీ బంద్ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తును పోలీసులు నిర్వహించారు. డీజీపీ ఆదేశాల మేరకు అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.