రెంజల్, ఏప్రిల్ 10: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ శనివారం నిజామాబాద్ జిల్లాకు రానున్నారు. రెంజల్ మండలం కందకుర్తి గ్రామంలో నిర్మించిన ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ బలిరాం పంత్ హెడ్గేవార్ స్మృతి మందిరాన్ని ఆయన ప్రారంభించనున్నారు. హెడ్గేవార్ పూర్వీకుల గ్రామమైన కందకుర్తిని దేశ భక్తి స్ఫూర్తి కేంద్రంగా చెబుతారు. ఈ నేపథ్యంలో ఇక్కడ రూ.35 కోట్లతో మూడంతస్తుల్లో నిర్మించిన కేశవ స్మృతి మందిరాన్ని మోహన్‌జీ నేడు ప్రారంభించనున్నారు. నాగ్‌పూర్ నుంచి బాసర మీదుగా కందకుర్తి గ్రామానికి శనివారం సాయంత్రం చేరుకోనున్న ఆయన.. తొలుత కేశవమూర్తి, రుక్మిణి సమేత విఠలేశ్వర, స్కంధ దేవాలయాన్ని సందర్శించి పూజలు చేస్తారు. అనంతరం కేశవ స్మృతి మందిరాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మోహన్‌జీ రాక నేపథ్యంలో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేశవ బలిరాం పంత్ హెడ్గేవార్‌కు చెందిన అనేక అంశాలను ఈ స్మృతి మందిరంలో ఏర్పాటు చేయనున్నారు. మొదటి అంతస్తులో భరతమాత విగ్రహం, డాక్టర్ హెడ్గేవార్ విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. అయోధ్య బాలరాముడి విగ్రహాన్ని తయారు చేసిన మైసూర్‌కు చెందిన అరుణ్ యోగిరాజ్‌తో వీటిని తయారు చేయించారు. డాక్టర్ జీ జీవిత విశేషాలు తెలిపే వీడియో ప్రదర్శన గదిని ఏర్పా టు చేశారు. మరోపక్క హెడ్గేవార్ స్వయంగా రాసిన లేఖలు, పుస్తకాలను ప్రదర్శనకు ఉంచనున్నారు. గ్రౌండ్ ఫొర్ల్లో డాక్టర్ హెడ్గేవార్ జీవిత విశేషాలతో కూడిన ఫొటో గ్యాలరీ, దేశం కోసం ఆయన అకాంక్షలను గుర్తిండిపోయేలా వివరాలను ఏర్పాటు చేస్తున్నారు.
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం పరిశీలించారు. ప్రారంభోత్సవంతో పాటు బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు, భద్రత, ఆయా విభాగాల మధ్య సమన్వయంపై ఆమె అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. సభా ప్రాంగణంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటుతో పాటు తాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు.
రెంజల్ ఇన్చార్జి తహసీల్దార్ శ్రావణ్‌కుమార్ పనితీరుపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన స్థానంలో కొత్త వారిని తహసీల్దార్‌గా నియమించాలని బోధన్ సబ్‌కలెక్టర్ వికాస్ మహతోకు సూచించారు. ఆమె వెంట బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయ్‌బాబు, ఆర్‌ఆండ్‌బీ డీఈ రామ్మోహన్రావు, ఎస్సై చంద్రమోహన్, తదితరులు ఉన్నారు.