నిత్యం రైతులకు అందుబాటులో ఉంటూ వ్యవసాయ సలహాలు అందించేందుకు ఏర్పాటు చేసిన రైతు వేదికల నిర్వహణకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. సాగుకు సంబంధించి రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు సీఎం కేసీఆర్ రైతు వేదికలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పథకాల అమలు, అవగాహన సదస్సుల నిర్వహణకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
రెంజల్, డిసెంబర్ 14: రైతు వేదికల నిర్వహణ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. సంవత్సరం క్రితం ప్రారంభించిన ఈ వేదికల నిర్వహణకు ఒక్కోదానికి రూ.9వేల చొప్పున అందించనున్నట్లు ప్రభుత్వం చెప్పింది. కరోనా కారణంగా నిధుల కేటాయింపులో కాస్త ఆలస్యం జరగగా, ఆర్థికంగా ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటున్నది. వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతుల కాంక్షను నెరవేరుస్తూ ప్రభుత్వం 2022 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు సంబంధించిన నిధులను మంజూరు చేసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 106 క్లస్టర్ల రైతు వేదికల నిర్వహణకు ఒక్కోనెలకు రూ.9వేలు చొప్పున మొత్తం రూ.47లక్షల 70వేలు మంజూరయ్యాయి.
106 క్లస్టర్లు…
వ్యవసాయ శాఖ సేవలను రైతులకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం జిల్లాలోని 106 క్లస్టర్లలో రైతు వేదికలు ఏర్పాటు చేసింది. ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక విస్తీర్ణాధికారిని నియమించింది. వారి సేవలను అందుబాటులోకి తెచ్చింది. క్షేత్రస్థాయి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చేందుకు గ్రామ , మండల, జిల్లా స్థాయి రైతు బంధు సమితిలను ఏర్పాటు చేసింది. వీరు ప్రభుత్వ యంత్రాంగంతో రైతులను సమన్వయం చేస్తూ సంధానకర్తలుగా పనిచేస్తున్నారు. ప్రతి విస్తీర్ణాధికారి రోజూ ఉదయం, సాయంత్రం వేళ్లలో గంట పాటు రైతువేదికల్లో రైతులకు అందుబాటులో ఉండాలని, అనంతరం క్షేత్రస్థాయిలో పంటల సందర్శనకు వెళ్లాలని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. వ్యవసాయ శాఖ సిబ్బందిపై నిర్వహణ ఖర్చు భారం కాకుండా ఆర్థిక మంత్రి హరీశ్‌రావు గత నెలలో ప్రకటించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటూ నిధులు విడుదల చేశారు.
ఐదు నెలల నిర్వహణకు…
ప్రభుత్వ హామీ మేరకు ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఒక్కో వేదికకు నెలకు రూ.9వేల చొప్పున ప్రభుత్వం జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయాల్లో జమ చేసింది. సంబంధిత ఏడీఏల పర్యవేక్షణలో ఏవోలు, ఏఈవోల సూచలన మేరకు ఈ నిధులను ఖర్చు చేస్తారు.
సద్వినియోగం చేసుకోవాలి
రైతు వేదికల నిర్వహణకు ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సద్వినియోగం చేసుకోవాలి. రైతు వేదికల్లో ఏఈవోలు రైతులకు అందుబాటులో ఉంటారు. రైతు శిక్షణ శిబిరాలు క్రమం తప్పకుండా నిర్వహించేందుకు నిధులు ఎంతో ఉపయోగపడుతాయి. ఈ అవకాశాలను వినియోగించుకొని, ఆధునిక వ్యవసాయంపై అవగాహన పెంచుకోవాలి .
– ఆర్. తిరుమలప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, నిజామాబాద్