నిజామాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జొన్న రైతుల పరిస్థితి అధ్వానంగా మారింది. కొనుగోళ్లలో జాప్యం, అకాల వర్షాల కారణంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. పంట కొనుగోళ్లలో తరుగు కూడా అన్నదాతలకు గుదిబండగా మారింది. యాసంగిలో రైతులు సాగుచేసిన జొన్నలను ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా సేకరిస్తున్నది. కామారెడ్డి జిల్లాలో 16 ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి జొన్నలు సేకరిస్తున్నది.
ఈసారి సగటున ఎకరాకు 15 క్వింటాళ్ల వరకు దిగుబడి రాగా, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాకు రూ.3,371 చొప్పున పంటను సేకరిస్తున్నారు. ప్రైవేటు వ్యాపారులు రూ.2,600 మాత్రమే చెల్లిస్తుండడంతో రైతులు కొనుగోలు కేంద్రాల వైపు మొగ్గు చూపారు. ప్రస్తుతం జొన్నల సేకరణ ముగింపు దశకు చేరింది. పంట విక్రయించి రోజులు గడుస్తున్నా రైతుల ఖాతాల్లో ఇప్పటికీ డబ్బులు పడలేదు. దీంతో కర్షకులు లబోదిబోమంటున్నారు.
దాదాపు రూ.100 కోట్లు మేర బకాయిలు పేరుకు పోయినట్లు తెలిసింది. మరోవైపు, పలు చోట్ల కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల దోపిడీతో రైతులు విలవిల్లాడుతున్నారు. సంచి బరువు ఎంత ఉంటే అంతే పరిమాణంలో జొన్నలను తీసుకోవాలని చెబుతున్నప్పటికీ, అదనంగా కిలోన్నరకు పైగానే దోపిడీ చేస్తుండడంపై మార్క్‌ఫెడ్, సహకార శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శ్రమజీవుల దోపిడీ..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతులు తీవ్ర దోపిడీకి గురవుతున్నారు. వడ్ల కొనుగోళ్లలో భారీగా తరుగు తీస్తూ రైస్‌మిల్లర్లు అన్నదాతలను దగా చేశారు. కొన్ని చోట్ల 40 కిలోల బస్తాకు 3-5 చొప్పున తరుగు పేరిట దోచుకున్నారు. పసుపు రైతులకు గిట్టుబాటు రాకుండా వ్యాపారులు సిండికేట్‌గా మారి తక్కువ ధరకే పంటను కొనుగోలు చేశారు. ఆమ్చూర్ రైతుల విషయంలోనూ నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ వేదికగా భారీ ఎత్తున దోపిడీ తంతు నడిచింది. తాజాగా జొన్న కొనుగోళ్ల విషయంలోనూ ఇలాగే దోపిడీ కొనసాగింది. ఆరుగాలం శ్రమించే అన్నదాతకు కష్టాలు తప్పడం లేదు.
పంట విత్తనాల కొనుగోలు నుంచి మార్కెట్‌కు తరలించే వరకు అడుగడుగునా ఇబ్బందులే ఎదురవుతున్నాయి. కొన్నిరోజులుగా కురుస్తున్న అకాల వానలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇక, 72 గంటల్లో జొన్న రైతులకు డబ్బులు చెల్లించాల్సి ఉండగా, రోజులు గడుస్తున్నా పైసా కూడా ఇవ్వట్లేదు. వానాకాలం సీజన్‌కు ముందే వానలు కురుస్తున్నాయి. సాగుకు అనుకూల వాతావరణం ఏర్పడడంతో విత్తనాల ను సిద్ధం చేసుకోవడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. చేతిలో డబ్బులు లేకపోవడంతో దిక్కుతోచక ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొన్నదని వాపోతున్నారు.
రూ.100 కోట్లు విడుదల అయ్యేనా…?
ఉమ్మడి జిల్లాలో జొన్నల సాగుకు కామారెడ్డి పెట్టింది పేరు. నీటి వసతి అంతగా లేని ప్రాంతాల్లో జొన్నలను ఎక్కువగా రైతులు సాగు చేస్తుంటారు. ఇందులో ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ ఏరియాలో ఏటా భారీగా జొన్న సాగు జరుగుతున్నది. నిజామాబాద్ జిల్లాలో కొద్దిమంది మాత్రమే జొన్నలను సాగు చేస్తున్నారు. ఈ సీజన్లో జొన్న సాగు చేసిన రైతులు అచ్చంగా పసుపు రైతుల మాదిరిగానే దోపిడీకి గురయ్యారు. మొదట్లో రైతుల చేతుల్లో పంట ఉన్నప్పుడు వ్యాపారులు గద్దల్లా వాలిపోయారు. అందిన కాడికి రూ.2600 చొప్పున క్వింటాకు చెల్లించి జొన్నలు సేకరించారు. తీరా సీజన్ ముగింపు సమయానికి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రాలను ప్రారంభించింది.
కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 2.96 లక్షల క్వింటాళ్ల జొన్నలను కొనుగోలు చేసినట్లు మార్క్‌ఫెడ్ అధికారులు చెబుతున్నారు. వీటి విలువ రూ.100 కోట్లు ఉంటుంది. ఇందులోంచి ఇప్పటివరకూ రైతుకు నయా పైసా కూడా చెల్లించలేదు. ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం వహించిన రాష్ట్ర ప్రభుత్వం.. జొన్నల సేకరణలోనూ తీవ్రమైన నిర్లక్ష్యం చేస్తున్నదని రైతాంగం మండిపడుతున్నది. పంట కోతల సమయంలో తెరవాల్సిన కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా తెరవడంతో అప్పటికే పెద్ద మొత్తంలో జొన్నలు దళారుల పాలయ్యాయి. ఫలితంగా రైతులు నష్టపోవాల్సి వచ్చింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో జొన్నలను అమ్ముకునేందుకు రైతులు సిద్ధపడగా చేతిలో పంట లేదు. కొనుగోలు కేంద్రాలకు వస్తున్న పంటలో వ్యాపారులే విక్రయిస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రెండు రోజుల్లో చెల్లింపులు జరుగుతాయి..
జొన్నల కొనుగోళ్లకు సంబంధించిన చెల్లింపులపై ప్రభుత్వానికి నివేదించాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రెండు రోజుల్లోనే మొత్తం చెల్లింపుల ప్రక్రియ పూర్తి అవుతుంది. నేరుగా రైతుల ఖాతాల్లోనే కనీస మద్దతు ధర ప్రకారం డబ్బులు జమ అవుతాయి.
– మహేశ్‌కుమార్, మార్క్‌ఫెడ్ మేనేజర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా