బాల్కొండ : రహదారి భద్రత జీవితానికి రక్షణ అని మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్( MEO Rajeshwar) అన్నారు. బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్వహించిన రోడ్డు భద్రత (Road safety) వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ (Pledge ) చేయించారు.
బాల్కొండ మండలంలో చిట్టాపూర్ శ్రీరాంపూర్ నుంచి బాల్కొండ వరకు 44వ జాతీయ రహదారి ( National Highway) రోడ్డుపై చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. రహదారిపై వెళ్లే సమయంలో విద్యార్థిని, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడప రాదని , వాహనదారులు హెల్మెట్ ధరించాలని కోరారు.
అత్యధిక రోడ్డు ప్రమాదాల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉందని , దాన్ని తగ్గించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని వివరించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. అనంతరం విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన, ఉపన్యాస , డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు.