నోటిదాకా వచ్చిన ముద్ద నేలపాలైనట్లు అకాల వర్షాలతో పంటలు నీళ్లపాలవుతున్నాయి. ఆరుగాలం శ్రమించిన రైతుకు పంట చేతికొచ్చే సమయంలోనే వరుణుడు కన్నెర్ర చేశాడు. దీంతో కర్షకుల కష్టం కల్లాల్లోనే నీటిపాలవుతున్నది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సాగు చేసిన వరి పంట చేతికొచ్చిందన్న ఆనందం అంతలోనే ఆవిరవుతున్నది. అకాల వర్షాలు అన్నదాతను తీవ్ర ఆవేదనలోకి నెట్టేశాయి. ఐదారు రోజుల నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను వర్షం విడవడం లేదు.
రాత్రయ్యిందంటే చాలు రైతుల గుండెల్లో గుబులు రేపుతున్నది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఉంటూ, సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, వడగండ్లతో కూడిన వర్షం కురుస్తుండడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఓ వైపు చేతికందే దశలో ఉన్న పంటలు వర్షం, ఈదురుగాలులకు నేలమట్టం అవుతుండగా, మరోవైపు ఇప్పటికే కోసి కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిముద్దవుతుంది. కోసిన పంటలను రక్షించుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యంపై టార్పాలిన్లు కప్పినా భారీ వర్షానికి రాశులపైకి నీళ్లు చేరుతున్నాయి. అకస్మాత్తుగా కురిసే వర్షంతో అన్నదాత నానాతంటాలు పడుతున్నాడు. ఆరబెట్టిన ధాన్యాన్ని ఒక్కచోటికి చేర్చడంలో ఏమాత్రం ఆలస్యమైనా వర్షపు ధాటికి ధాన్యమంతా కొట్టుకుపోతోంది. వరుస వర్షాలతో రైతులు కోలుకోలేని పరిస్థితి నెలకొన్నది. మరోవైపు ధాన్యం తడవడంతో రాశుల్లోని గింజలు మొలకెత్తాయి.