వినాయక్ నగర్, సెప్టెంబర్ 3: నిజామాబాద్ నగరపాలక సంస్థలో సీనియర్ అసిస్టెంట్, ఇన్చార్జి ఆర్ఐ (రెవెన్యూ ఇన్స్పెక్టర్)గా పనిచేస్తున్న కర్ణ శ్రీనివాస్ రావు బుధవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఓ వ్యక్తి నుంచి రూ. 7 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అయితే సదరు ఉద్యోగి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టబడడం రెండోసారి కావడం గమనార్హం.
జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఖాళీ స్థలంలో జ్యూస్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడానికి కార్పొరేషన్ నుంచి వీఎల్టీ (వేకెంట్ ల్యాండ్ టాక్స్) నంబర్ అలాట్ కోసం సీనియర్ అసిస్టెంట్, ఇన్చార్జి ఆర్ఐ కర్ణ శ్రీనివాస్‌రావును కలిశాడు. నంబర్ అలాట్ చేయాలంటే రూ.10వేలు లంచం ఇవ్వాలని ఆర్ఐ డిమాండ్ చేయగా.. అంత ఇవ్వలేనని సదరు వ్యక్తి చెప్పగా చివరికి రూ.7వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
లంచం ఇవ్వడం ఇష్టం లేని సదరు వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. దీంతో ఏసీబీ ఇన్చార్జి డీఎస్పీ లక్ష్మీకాంత్ తన సిబ్బందితో కలిసి వలపన్ని కార్పొరేషన్‌లోని రెవెన్యూ సెక్షన్లో బాధితుడి నుంచి ఆర్ఐ శ్రీనివాసరావు రూ. 7వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సదరు ఉద్యోగిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేసి నాంపల్లి ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపర్చినట్లు ఇన్చార్జి డీఎస్పీ లక్ష్మీకాంత్ తెలిపారు.
గతంలోనూ ఏసీబీకి చిక్కిన ఘనుడు
బుధవారం ఏసీబీ అధికారులకు చిక్కిన సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్‌రావు లంచం తీసుకుంటూ పట్టుబడడం ఇది రెండోసారి. 2019లో బోధన్ మున్సిపల్లో పనిచేస్తుండగా ఓ వ్యక్తి నుంచి వెయ్యి రూపాయలు లంచం తీసుకుంటూ చిక్కినట్లు తోటి ఉద్యోగుల ద్వారా తెలిసింది. ఒకసారి సస్పెన్షన్‌కు గురై జైలుకు వెళ్లి వచ్చినా తన తీరు మార్చుకోలేదని పలువురు ఉద్యోగులు మండిపడుతున్నారు.