Revenue conference | పెద్ద కొడప్ గల్, జులై 05: రెవెన్యూ సదస్సులో సమస్యలను పరిష్కరించేందుకు రైతుల నుంచి తీసుకున్న దరఖాస్తులను నెల రోజుల్లోపు పరిష్కరించాలంటూ బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ తహసీల్దార్ కార్యాలయాన్ని శనివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసిన రెవెన్యూ దరఖాస్తులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెద్ద కొడప్ గల్ మండలంలో జరిగిన రెవెన్యూ సదస్సులలో 499మంది రైతులు దరఖాస్తు చేసుకోగా వాటిలో 152 మందికి నోటీసులు అందజేశామని, మిగిలిన వాటిలో చాలావరకు అటవీశాఖకు చెందిన దరఖాస్తులే వచ్చాయని ఆమె తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పనితీరుపై అడిగి తెలుసుకున్నారు.
ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు తప్పకుండా ఇండ్లు నిర్మించుకోవాలన్నారు. ఇంటి బిల్లు నాలుగు విడతలో అందజేస్తామన్నారు. మహిళా సంఘం నుండి రూ.లక్ష రుణం కూడా ఇప్పిస్తామన్నాని లబ్ధిదారులకు సూచించారు. బాబుల్ గం గ్రామస్తులు పెద్ద కొడప్ గల్ మండలంలో రేషన్ కార్డు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ దరఖాస్తులు కావడంలేదని ఆమె దృష్టికి తీసుకువచ్చారు.
మీ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ పనులు పరిశీలించారు. ఆమె వెంట తహసీల్దార్ దశరథ్, నాయబ్ తహసీల్దార్ రవికాంత్, ఆర్ఐ అంజన్న, రెవిన్యూ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.