Nizamabad | వినాయక నగర్, డిసెంబర్ 03 : జూబ్లీహిల్స్ లో గెలవగానే రేవంత్ రెడ్డి కండ్లు నెత్తికెక్కి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని, హిందూ దేవుళ్లను నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి హిందువా కాదా..? అని భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కుల చారి ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్ లో ఆ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నల్ల బ్యాడ్జీలు ధరించి సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా దినేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక మతానికి మాత్రమే పనిచేస్తుందని మండిపడ్డారు. బీహార్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టారని, రేపు ఆ మతానికి చెందినవారు కూడా కాంగ్రెస్ పార్టీని బొంద పెడితే అప్పుడు తెలుస్తుందని వ్యాఖ్యానించారు. హిందూ దేవుళ్ల గురించి తప్పుగా మాట్లాడిన రేవంత్ రెడ్డిని వెంటనే ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీలో ఉన్న సెక్యులర్ నాయకులను డిమాండ్ చేశారు.
హిందువుల భావాలను రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఇవన్నీ ఒక వర్గం ఓట్ల కోసం చేస్తున్న రాజకీయ నాటకమని దినేష్ పటేల్ తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతంకర్ లక్ష్మి నారాయణ, నాగోల్ల లక్ష్మి నారాయణ, ఆకుల శ్రీనివాస్, బూరుగుల వినోద్, ఇప్పకాయల కిషోర్,మల్లేష్ గుప్తా, గడ్డం రాజు, అంబదాస్ రావు, గిరిబాబు, యాదల నరేష్, ఆమందు విజయ్ కృష్ణ, ఆనంద్, చిరంజీవి, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.