మోర్తాడ్, అక్టోబర్ 14: ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు రిటైర్డ్ అయ్యాక ఇద్దరు కుమారులకు ఇండ్లు కట్టించి వారికి పెండ్లిళ్లు చేయాలని కలలు కన్నాడు.. మరో ప్రభుత్వ ఉద్యో గి తనకు ఉన్న ఇద్దరు కుమారులకు ఇండ్లు కట్టించే పనులు ప్రారంభించాడు.. అందుకోసం అప్పు కూడా చేశాడు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయి కదా ఇల్లు కడుదామనుకున్న ఉపాధ్యాయుడి కల.. కల్లలుగానే మిగిలింది. ఇల్లు కట్టడం ప్రారంభించిన ఉద్యోగి చేసిన అప్పులకు వడ్డీ కట్టలేక, బెనిఫిట్స్ రాక ఇంటి నిర్మాణ పనులను మధ్య లోనే ఆపేశాడు. ఉద్యోగ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఇలా కడు దయనీయంగా మారింది. దశాబ్దాలుగా ఉద్యోగం చేస్తూ వచ్చిన జీతంలో కుటుంబపోషణ, పిల్లల చదువులను చక్క దిద్దుకుంటూ వెళ్లిన ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగం చేస్తున్నంత కాలం జీపీఎఫ్, పీఎఫ్ రూపంలో తాము కూడబెట్టుకున్న డబ్బుతో ఏదో చేయాలని కలలు కంటారు. కానీ రెండేండ్ల కాలంలో ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగుల పరిస్థితి మాత్రం కడు దయనీయంగా మారింది. కాంగ్రెస్ సర్కారు పనితీరుతో వారు కన్న కలలన్నీ నెరవేరకుండాపోయే పరిస్థితి ఏర్పడింది.
ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చాకా ఇండ్లు కట్టి కొడుకులకు ఘనంగా పెండ్లి చేయాలనుకుంటున్న తల్లిదండ్రుల పరిస్థితి కడు దయనీయంగా తయారైంది. బెనిఫిట్స్ రాకపోవడంతో ఇల్లు కట్టే ఆలోచన విరమించుకుంటున్నారు. ప్రభుత్వం బెనిఫిట్స్ ఇస్తుందా..? ఎప్పుడిస్తుంది..? అనే మీమాంసతో పనులు వాయిదావేసుకుంటున్నారు. మంచి ఇల్లు ఉంటేనే కొడుకులకు పెండ్లి చేసే అవకాశం ఉండడంతో వారి పెండ్లిళ్లు కూడా వాయిదా వేయాల్సిన పరిస్థితులు. మరోవైపు ఆడపిల్లలు ఉంటే అప్పులు చేసి మరీ పెండ్లి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చాక బ్యాంక్లోన్లు, అప్పులు కడుదామనుకున్న వారి పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. అటు బ్యాంకుల్లో లోన్లు కట్టలేక, చేసిన అప్పులకు వడ్డీకట్టలేక కుటుంబ పోషణ, వైద్యఖర్చులు భారంగా మారాయి. ఇంత కడుదయనీయ పరిస్థితులు విశ్రాంత ఉద్యోగులు మునుపెన్నడూ చూడలేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకుని రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను వెంటనే ఇవ్వాలని విశ్రాంత ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. బెనిఫిట్స్ ఇచ్చే విషయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తుండడంతో వా రు ఉద్యమకార్యాచరణ చేపట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉద్యమకార్యాచరణపై సమాలోచనలు చేస్తున్న నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా విశ్రాంత ఉద్యోగులు అదే యోచనలో ఉన్నట్లు తెలిసింది.
సుదీర్ఘకాలంగా కన్న కలలను రిటైర్మెంట్ బెనిఫిట్స్‌తో నెరవేర్చుకుందామని అనుకున్న విశ్రాంత ఉద్యోగులకు రెండు సంవత్సరాలుగా బెనిఫిట్స్ ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినా ఫలితం కనిపించకపోవడంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో విశ్రాంత ఉద్యోగులు ఉన్నారు. ఒకవైపు డబ్బులు రాక, బ్యాంకులో లోన్లు ఉన్నా కట్టలేక, చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక, పిల్లలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక దయనీయపరిస్థితులను ఎదుర్కొంటున్నారు. దీంతో దిక్కుతోచక కోర్టును ఆశ్రయిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి రిటైర్డ్ ఉపాధ్యాయులు మగ్గిడి శంకర్, నారాయణ, రాములు, లింబాద్రి, ప్రభు, నర్సయ్య కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఆరువారాల్లో విశ్రాంత ఉపాధ్యాయులకు బెనిఫిట్స్ ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినా.. ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదు. దీంతో తిరిగి కోర్టు ధిక్కార నోటీస్‌లు కూడా పంపించారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ దశాబ్దాలుగా కూడబెట్టుకున్న తమ డబ్బు, తమకు రావాల్సిన బెనిఫిట్స్‌ను ప్రభుత్వం ఇవ్వకుండా వ్యవహరిస్తున్న తీరుపై విశ్రాంత ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సంపాదన లేక ఖర్చులు పెట్టుకుని కోర్టును ఆశ్రయించిన పరిస్థితులు ఏర్పడ్డాయని, ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలు అందించిన వారి విషయంలో సర్కారు ఈ విధంగా వ్యవహరించడం మంచిది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మాకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కోర్టును ఆశ్రయించాం. బెనిఫిట్స్ చెల్లించాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చి మూడునెలలు గడిచింది. అయినా బెనిఫిట్స్ రాకపోవడంతో కోర్టు ధిక్కార నోటీసులు కూడా సంబంధిత ప్రభుత్వ అధికారులకు పంపించాం. జిల్లాలో దాదాపు రెండువేల మంది విశ్రాంత ఉపాధ్యాయులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. బెనిఫిట్స్ రాక మానసిక ఆందోళనకు గురవుతున్నారు. కావున వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి.
-మగ్గిడి శంకర్, రిటైర్డ్ టీచర్, మోర్తాడ్
రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెనుకాముందు వస్తాయన్న ధీమాతో ఇల్లు కట్టడం ప్రారంభించిన.. అందుకోసం బాకీ చేసిన, కానీ రిటైర్మెం ట్ బెనిఫిట్స్ ఇప్పటికీ రాకపోవడంతో ఇంటి నిర్మాణ పనులను మధ్యలోనే ఆపేసిన. అప్పుచేసిన వారికి వడ్డీ కట్టడం, కుటుంబపోషణ భారంగా మారింది. సమయానికి బెనిఫిట్స్ వస్తే ఇంటి నిర్మాణ పనులు పూర్తిచేసుకుని హాయిగా ఉండే వారం. ఇప్పుడు చేసిన అప్పుకు వడ్డీ కట్టుకుంటూ, మధ్యలోనే ఇంటి నిర్మాణం పనులను ఆపేయడం మానసికంగా ఎంతో ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితులను గుర్తించి బెనిఫిట్స్‌ను వెంటనే అందించాలి.
-నారాయణ రిటైర్డ్ టీచర్, నల్లూర్