ప్రజాక్షేత్రంలో ఉన్న నాయకులు అవినీతి, బంధుప్రీతి, వివాదాలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. ప్రజలకు పారదర్శకంగా సేవలు అందిస్తారనే భావన నాయకుల వ్యవహారశైలిపై ఆధారపడి ఉంటుంది. కానీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలువురు కళంకితులకు పదవులు వరించడం.. అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్నది.
అలాంటి వారిని అందలం ఎలా ఎక్కిస్తారని ఒకవైపు పార్టీ శ్రేణులు ప్రశ్నించగా.. మరోవైపు ఆశావహులు మండిపడుతున్నారు. ఎలాంటి మచ్చ లేకుండా పనిచేస్తున్న కార్యకర్తలు, సీనియర్ నాయకులను పక్కనబెట్టి, వివాదాస్పద వ్యక్తులకు పదవులు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమని నిలదీస్తున్నారు. ఈ వ్యవహారంపై హస్తం నేతల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
-నిజామాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కళంకిత నాయకులను ఉన్నత స్థానాల్లో కూర్చో బెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జానీకి జాతీయ అవార్డును కేంద్రం రద్దు చేయడంతో ఈ వ్యవహారం తెర మీదికి వచ్చింది. స్వయంగా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు ప్రదానం ఉండడంతో కేంద్ర సర్కారు వెనుకడుగు వేసింది.
కామారెడ్డి జిల్లాలోని గాంధారి పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన ఓ నాయకుడికి ఓ మార్కెట్ కమిటీలో కీలక పదవిని అప్పగించారు. ఇతగాడిపై కామారెడ్డి ఠాణాలోనూ పలు ఫిర్యాదులు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఓ నాయకుడిపై ఒక మహిళ తీవ్ర లైంగిక ఆరోపణలు చేయగా.. ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. తనను అధికార పార్టీ నేత మోసం చేశారంటూ ఆరోపణలు సైతం చేయగా సదరు నేతకే పదవులు వరించడం గమనార్హం. కళంకితులకు పదవుల కట్టబెట్టడం ద్వారా కాంగ్రెస్ నవ్వుల పాలవుతుందని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు.
గాంధారి పోలీస్ స్టేషన్‌పై కొద్ది రోజుల క్రితం దాడి జరిగింది. కొంతమంది వ్యక్తులతో కలిసి ఓ నాయకుడు ఇందులో కీలక పాత్రధారిగా నిలిచాడు. ఈ కేసును జిల్లా ఎస్పీ తీవ్రంగా పరిగణించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు విచారణ కొనసాగుతున్న క్రమంలో ఠాణాపై దాడి చేసిన వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవిని అప్పగించింది. తద్వారా ప్రజలకు తప్పుడు సందేశాన్ని పంపించేలా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
దాడులకు తెగబడితేనే పదవులా! శాంతి, భద్రతల పరిరక్షణ కోసం నిబద్ధతో పనిచేస్తున్న పోలీసులపై దాడి చేసిన వ్యక్తికి పదవిని కట్టబెట్టడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అలాంటి వారికి రాజకీయంగా ప్రమోషన్ కల్పించడంతో స్థానికంగా తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశమూ ఉంది. దాడులకు తెగబడితేనే పదవులు వస్తాయా? అనే చర్చ నడుస్తోంది. పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన నాయకుడికి పదవి ఇవ్వొద్దని స్థానిక పోలీసులే ఓ ప్రజాప్రతినిధికి మొర పెట్టుకున్నారు. ఠాణాపై దాడి చేసిన వారికి చట్టం ముందు శిక్షార్హులుగా నిలబెట్టాల్సిన అవసరం ఉందని వాదించారు.
లేదంటే ఇలాంటి చర్యలు పెరిగిపోయే ప్రమాదం ఉన్నదని ఖాకీలు చెప్పినప్పటికీ.. మొండిగా ఓ కాంగ్రెస్ నేత ముందుకెళ్లారు. దీంతో పోలీసులంటే ప్రజల్లో చులకన భావన ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. నిఘా వర్గాలు సైతం రంగంలోకి దిగి సదరు నాయకుడి తీరుపై నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిసింది. కానీ ప్రభుత్వ పెద్దలు అవేమీ పట్టించుకోకపోవడంతో వ్యవసాయ శాఖ ద్వారా ఆర్డర్ కాపీ జారీ కావడంతో పోలీసులు మిన్నకుండి పోవాల్సి వచ్చింది. సదరు నాయకుడికి ప్రొటోకాల్ పేరుతో ఏదో ఒక రూపంలో పోలీసులే మర్యాదలు చేయాల్సిన పరిస్థితి రావడం గమనార్హం
సుదీర్ఘ కాలం తర్వాత నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం కొలువుదీరింది. చాలా మంది ఆశావహులు పోటీపడగా నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్ ప్రాంతాలకు చెందిన వారికి అవకాశం కల్పించారు. ఇందులో ఓ కీలక పదవిని పొందిన నాయకుడిపై ఓ మహిళ తీవ్రమైన లైంగిక ఆరోపణలు చేసింది. దాదాపుగా ఆరు నెలల నుంచి ఈ వ్యవహారం నడుస్తోంది. దశాబ్దాల క్రితం నుంచి ఓ మహిళతో సహజీవనం చేస్తున్న విషయం బయటికి పొక్కడంతో సదరు కాంగ్రెస్ నేత ఉక్కిరిబిక్కిరయ్యాడు.
తీరా సీన్ కట్ చేస్తే ఆయనకే మార్కెట్ కమిటీలో కీలక బాధ్యతలను అప్పగించడంపై కాంగ్రెస్ పార్టీ తీరుపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. సొంత పార్టీలోనూ పలువురు నేతలు అధిష్టానం తీరును తప్పుపడుతున్నారు. లైంగిక ఆరోపణలు వెలుగు చూసినప్పటికీ పదవులు కట్టబెట్టడం ద్వారా సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారంటూ నిలదీస్తున్నారు. మొత్తానికి ఉమ్మడి జిల్లాలో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల భర్తీలో కళంకితులకు పదవులు కట్టబెట్టడం దుమారం రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో నైతికత అన్నది బుట్టదాఖలు కావడం, తాము అనుకున్నది అమలు చేయడం మినహా ప్రజలు ఏమనుకుంటారు? అనే ఆలోచనే చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.