బోధన్, ఆగస్టు 29 : రాజీ పడదగిన చిన్నపాటి గొడవలు, సమస్యల పరిష్కారానికి ‘కమ్యూనిటీ మీడియేషన్ కేంద్రాలు’ చక్కటి వేదికగా నిలవాలని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. గురువారం బోధన్‌లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్ భవనంలో ఏర్పాటుచేసిన కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్‌ను ఆమె గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటగా బోధన్‌లో ఏర్పాటుచేసిన ఈ కేంద్రాన్ని అన్ని శాఖలు, అధికారులు తగిన సహకారం, ప్రోత్సాహం అందించి విజయవంతం చేయాలని కోరారు.
అహంతో స్టేషన్లకు..
చిన్నచిన్న సమస్యలు సైతం అహం కారణంగా పోలీస్ స్టేషన్లకు వస్తాయని, కుటుంబ తగాదాలు, భూతగాదాలు, ఆస్తి పంపకాలు వంటి సమస్యలతో పలువురు పోలీస్ స్టేషన్లు, న్యాయస్థానాలను ఆశ్రయిస్తారన్నారు. ఇలాంటి తగాదాల పరిష్కారం కోసమే తెలంగాణ రాష్ట్ర న్యాయసేవా సదన్, జిల్లా న్యాయసేవా సదన్ ఆధ్వర్యంలో బోధన్ మండల న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఈ కేంద్రాన్ని ప్రారంభించామన్నారు.
రాజీ పడదగిన, అనుకూలంగా ఉన్న సమస్యలను ఈ కేంద్రం ద్వారా అవసరమైతే ఒకటికి రెండుసార్లు కౌన్సిలింగ్ ఇచ్చి ఇరు పక్షాలను సామరస్య పరిష్కారానికి ఒప్పించాలని నిర్వాహకులకు సూచించారు. ఓపికతో, సమయం తీసుకుని సమస్యల పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా కేసుల వల్ల జరిగే సమయం, డబ్బు వృథాపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కేంద్రం ద్వారా సమస్యలు పరిష్కరించి, పోలీస్‌శాఖకు, న్యాయస్థానాలకు పని తగ్గించాలని ఆమె కోరారు. ప్రతీ సమస్యకు పరిష్కారం ఉంటుందనే విషయం వారికి వెల్లడించి, సానుకూలంగా పరిష్కరించాలన్నారు.
సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి, బోధన్ జిల్లా ఐదవ అదనపు న్యాయమూర్తి ఎస్. రవికుమార్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పూజిత, సీనియర్ సివిల్ జడ్జి అజయ్‌కుమార్, అదనపు జూనియర్ సివిల్ ఈ. జడ్జి సాయిశివ, స్పెషల్ జడ్జి శేషతల్ప శాయి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పోశెట్టి, జనరల్ సెక్రెటరీ కోటేశ్వర్రావు, కోశాధికారి శ్రీధర్‌బాబు, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డాక్టర్ పల్నాటి సమ్మయ్య, ఏసీపీ శ్రీనివాస్, ఆర్డీవో రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ వెంకట నారాయణ, కేంద్రం నిర్వాహకులు టి. పద్మాసింగ్, సుజాత, విశ్రాంత ఉపాధ్యాయులు రాజేందర్‌సింగ్, రాజేశ్వర్ పాల్గొన్నారు.