Sarangapur | కంటేశ్వర్, డిసెంబర్ 29 : నిజామాబాద్ జిల్లా సారంగాపూర్ 13వ డివిజన్ ప్రజలు అర్హులైన పేదలకు ప్రభుత్వ భూమిని పంచి ఇవ్వాలని సోమవారం ప్రజావాణిలో కలెక్టర్కు పలువురు వినతి పత్రం అందజేశారు. సారంగాపూర్ లో 231 సర్వే నంబర్ 13వ డివిజన్లోని భూమి అర్హులైన పేదలకు పంచి ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా సారంగాపూర్ ప్రాంతంలో 231 సర్వే నంబరు గల ప్రభుత్వ భూమి ఇందులో దాదాపు 10 ఎకరాల భూమిలో ఎలాంటి చర్యలు చేపట్టరాదని, ఇది ప్రభుత్వ భూమి బీదవారికి పంపించాలని కోరారు.
గతంలోనే అధికారులు తమకు అందజేస్తామని తెలిపి ఇప్పుడు మాత్రం స్పోర్ట్స్ స్టేడియం కడతామని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతవరకు చాలా అసైన్మెంట్ భూములు చెరువులు సైతం విచ్చలవిడిగా కొందరు పాలకులు కబ్జాలు చేసుకొని అమ్ముకుంటున్నారని, ఇక్కడ ఉన్నటువంటి బీద ప్రజలు ఎలాంటి ఇల్లు వాకిలి వంటి స్థలాలు లేక ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. .
అర్హులైన పేద ప్రజలకు ఇల్లు నిర్మించుకునేందుకు స్థలం ఇవ్వాలని పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితిలో సారంగాపూర్ లో స్పోర్ట్స్ స్టేడియం కట్టడానికి అంగీకరించబోమని, గతంలో అధికారులు, నాయకులు ఇచ్చిన మాట ప్రకారం సారంగాపూర్ ప్రాంత అర్హులైన పేద ప్రజలకు ప్లాట్స్ రూపేణా పంచి ఇచ్చి ఊరికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఒల్లెపు రాజు, రసూల్, మహేష్, తాహెర్, సిరాజ్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.