రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా ఆశాలు గతంలో ఆఫ్లైన్లోనే వైద్యారోగ్య శాఖకు నివేదికలను పంపేది. తద్వారా సమయం ఎక్కువగా తీసుకోవడం, నివేదికల సమర్పణకు ఖర్చు మీద పడడం వంటి ఇబ్బందులు ఉండటంతో కేసీఆర్ హయాంలో ట్యాబ్లు అందించి వారి ఇక్కట్లు తొలగించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ క్షేత్ర స్థాయిలో ప్రజల ఆరోగ్య వివరాల సేకరణలో ఆశ వర్కర్ల పాత్ర ఎంతో కీలకం. వారితో గొడ్డు చాకిరి చేయించుకుంటోన్న కాంగ్రెస్ పాలకులు వీరి బాగోగుల విషయాన్ని పట్టించుకోవడంలేదు.
పాలన బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏ ఒక్క రోజూ ఆశ వర్కర్ల పరిస్థితిపై ప్రభుత్వం సమీక్ష చేయలేదు. ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు ప్రకటన ఇవ్వలేదు. పెరిగిన ధరలతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. చాలీ చాలని జీతాలతో నెట్టుకొస్తున్న తమకు వేతనాలు పెంచాలని కోరుతున్నారు. కనీస వేతనం రూ.18వేలు అందివ్వాలంటూ ఆశ వర్కర్లం తా ప్రభుత్వంపై పోరు బాట మొదలు పెట్టారు. దశల వారీగా షురూ చేసిన ఆందోళన కార్యక్రమాలు రోజురోజుకు ఉధృతం అవుతున్నాయి. అయినప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో చలనం రావడం లేదు.