పిట్లం, డిసెంబర్ 22: రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నది. అన్నదాతలు పంట నాటు మొదలు పంట చేతికి వచ్చే వరకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నది. ఇందులో భాగంగానే ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం ఆరబెట్టుకునేందుకు సబ్సిడీపై కల్లాలను మంజూరు చేసింది.
రైతు నష్టపోకుండా..
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం నూర్పిడి అనంతరం అకాల వర్షాలు కురియడంతో తడిసిపోతున్నది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంట కోసిన అనంతరం ఆరబెట్టుకునేందుకు సరైన సౌకర్యాల లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అన్నదాతల కష్టాల దూరం చేసేందుకు పంటను తమ పంటపొలాల్లో ఆరబెట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై రైతు కల్లాలను మంజూరు చేసింది. రోడ్డుపై ధాన్యాన్ని ఆరబెట్టడం ద్వారా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు కల్లాల నిర్మాణంతో చెక్ పడింది. కల్లాల ఏర్పాటు కోసం ఉపాధిహామీ పథకం ద్వారా సబ్సిడీపై రైతు కల్లాలు నిర్మించి రైతులకు సౌకర్యాలు కల్పిస్తున్నది. దీంతో అన్నదాతలు కల్లాలు నిర్మించుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందులు దూరం..
ప్రతి సంవత్సరం చేతికొచ్చిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. రోడ్లపై ఆరబెట్టడంతో పలు సందర్భాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
సరైన ప్రదేశంలో పంట ఆరబెట్టకపోవడంతో వర్షాలు కురిసి పంట మొత్తం నీటి పాలవుతున్నది. పండించిన పంటను పంట చేలు వద్ద నుంచి మరో చోటికి చేర్చడం, అక్కడి నుంచి ధాన్యాన్ని సిద్ధం చేసి మార్కెట్కు తీసుకెళ్లడం రైతుకు ఆర్థికంగా ఇబ్బంది మారుతున్నది. వీటికి చెక్ పెట్టేందుకు రైతులు తమ పంట పొలాల్లోనే కల్లాలు నిర్మించుకునేలా ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. మండలంలోని 150 మంది లబ్ధిదారులు పంటపొలాల్లో కల్లాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 90 శాతం రైతులు నూర్పిడి కల్లాలు నిర్మాణం చేపట్టడంతో వారికి సౌకర్యవంతంగా మారాయి. కల్లం నిర్మాణానికి ప్రభు త్వం గుంట భూమిని తప్పనిసరిగా కేటాయించాలని ఆదేశించడంతో రైతులు నిబంధనల ప్రకారం వారి పంటపొలాల్లో గుంట భూమిని ఎంపిక చేసి ఉపాధిహామీ అధికారులకు దరఖాస్తు చేసుకోగా కల్లాల మంజూరు చేయడంతో నిర్మాణం చేపట్టుకున్నారు.
కల్లాలపై కేంద్రం పేచీ
రైతులకు ఎంతో సౌకర్యవంతంగా మారిన కల్లాల నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వం పేచీ పెడుతున్నది. ఉపాధి పథకంలో ఉన్న నిబంధనలకు అనుగుణంగా వ్యవసాయరంగానికి నిధులు ఖర్చు చేశారు. ఆ నిబంధనల ప్రకారమే రైతులు కల్లాలు నిర్మించుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం రైతులు నిర్మించుకున్న కల్లాలు డబ్బులు తిరిగి ఇవ్వాలని పేచీ పెడుతున్నది. కేంద్రం తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ధాన్యం మోసే బాధ తప్పింది
రాష్ట్ర ప్రభుత్వం రైతుల సౌకర్యార్థం సబ్సిడీతో కల్లాలను మంజూరు చేసి ఆదుకోవడం బాగుంది. పంటపొలంలో గుంట భూమిలో రైతు కల్లాన్ని కట్టుకుని పంటను నూర్పిడి చేసుకుంటున్నాను. కల్లాలు నిర్మించుకోవడంతో పండించిన పంట ఒక చోట నుంచి మరో చోటుకు మోసే బాధ తప్పింది.
-సి.నార్యానాయక్, రైతు తిమ్మానగర్తండా
కల్లాలతో రైతులకు మేలు
కల్లాల నిర్మాణంతో రైతులు ఎంతో మేలు చేకూరింది. పండించిన ధాన్యాన్ని నూర్పిడి చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై కల్లాలను నిర్మించి ఇచ్చింది. మండలంలో మొత్తం 150 మంది కల్లాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 90 శాతం మంది రైతులు కల్లాలను నిర్మించుకున్నారు. కల్లాల నిర్మాణంపై రైతులకు అవగాహన కల్పించాం.
-కిషన్, పిట్లం మండల వ్యవసాయశాఖ అధికారి