కంఠేశ్వర్/ ఖలీల్‌వాడి, అక్టోబర్ 27: రాష్ట్రంలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం తెలంగాణ బీసీ కమిషన్ ప్రతినిధులు బృందం ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్నది. కమిషన్ చైర్మన్ నిరంజన్ నేతృత్వంలో సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి విచ్చేయగా, స్థానిక రోడ్లు, భవనాల శాఖ అతిథిగృహంలో వారికి అదనపు కలెక్టర్ ఎస్.కిరణ్‌కుమార్, ఆర్డీవో రాజేంద్రకుమార్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారిణి స్రవంతి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.
అనంతరం కమిషన్ చైర్మన్, సభ్యులు జిల్లా అధికారులతో భేటీ కాగా..స్థానిక పరిస్థితులపై కొద్దిసేపు చర్చించారు. అనంతరం బృందం సభ్యులు శ్రీజ్ఞాన సరస్వతి దేవస్థానం సందర్శన కోసం బాసర పుణ్యక్షేత్రానికి బయల్దేరి వెళ్లారు. సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజాభిప్రాయ సేకరణను పూర్తి చేసుకుని తిరిగి నిజామాబాద్‌కు చేరుకుంటారు. ఈనెల 29న ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించి అభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు.