నిజామాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ప్రక్షాళన మొదలైంది. టాస్క్ఫోర్స్ విభాగంలో జరుగుతున్న అక్రమాలను ఎత్తిచూపుతూ ఇటీవల ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనం పోలీసు శాఖను కదిలించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక విభాగంలో భారీగా బదిలీలు చోటు చేసుకుంటున్నాయి. కొంత మంది ఖాకీల తీరుతో పోలీస్ శాఖ పరువు దిగజారుతున్న తరుణంలో ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. 97 మందికి స్థానచలనం కల్పించారు. మరో ఇద్దరిపై సస్పెన్షన్ వేటు వేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఏ చిన్న తప్పు జరిగినా సీపీ కల్మేశ్వర్ సింగేనవార్ ఏమాత్రం ఉపేక్షించడం లేదు. ఈ క్రమంలోనే టాస్క్ఫోర్స్లో జరుగుతున్న అవినీతిని నిర్మూలించేందుకు నడుం బిగించారు. రాజకీయ నాయకుల అండదండలతో ఏండ్లుగా ఒకే చోట పాతుకుపోయిన వారిని బదిలీ చేశారు. పైరవీలు అనే మాటెత్తకుండా చెప్పిన చోట పని చేసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. నాయకుల పేరుతో లెటర్లు తీసుకెళ్తే మొదటికే మోసం వస్తుందన్న భయంతో కానిస్టేబుళ్లు వెనకడుగు వేస్తున్నారు.
టాస్క్ఫోర్స్ విభాగంలో అవినీతి, అక్రమాల వ్యవహారాలపై ‘నమస్తే తెలంగాణ’ ఇటీవల ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీంతో ప్రత్యేక విభాగంలో అసలేం జరుగుతున్న దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నా రు. ఏడాది కాలంలో కళంకిత అధికారి నేతృత్వంలో రెండు వందలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇందులో అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి బదులుగా, తమ జేబులు నింపుకొనేందుకు ప్రత్యేక విభాగానికి ఉన్న అధికారాన్ని వాడుకున్నట్లు తెలిసింది. ఉన్నతాధికారుల కళ్లు గప్పి పాత ఏసీపీ చేసిన ఈ భారీ కార్యకలాపాలకు వంత పాడిన వారిపై చర్యలు తీసుకునేందుకు సీపీ సిద్ధమవుతున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే తొలి దశలో బదిలీ చేయడం, రెండో దశలో శాఖాపరమైన చర్యలు తీసుకుంటారని ప్రచారం జరుగుతున్నది.
టాస్క్ఫోర్స్ విభాగంలో తాజాగా మరో ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యం, పలు ఆరోపణల నేపథ్యంలో ఇద్దరిని సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. టాస్క్ఫోర్స్లో ప్రక్షాళన ప్రారంభించిన సీపీ.. బదిలీ అస్ర్తాన్ని ఎంచుకున్నారు. సోమవారం రాత్రి జరిగిన బదిలీల్లో 73 మంది కానిస్టేబుళ్లు, 12 మంది హెడ్ కానిస్టేబుళ్లు, ఆరుగురు ఏఎస్సైలు ఉండగా, మంగళవారం మరో ఆరుగురు కానిస్టేబుళ్లకు స్థానచలనం కలిగించారు. దీంతో ఇప్పటి వరకు 97 మందిని బదిలీ చేశారు. నలుగురు కానిస్టేబుళ్లు, ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లను ఈ విభాగం నుంచి తొలగించి వివిధ ఠాణాలకు అటాచ్ చేశారు. బదిలీలు, సస్పెన్షన్లలతో టాస్క్ఫోర్స్ విభాగం ప్రస్తుతం సగం ఖాళీగానే మారింది. కొత్తగా ఈ విభాగానికి వేరే వారిని నియమించలేదు. ఎలాంటి ఆరోపణలు లేని ఖాకీలకు పోస్టింగ్లు ఇచ్చేందుకు ఉన్నతాధికారులు జాబితా రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే, తాజాగా ఇద్దరిని సస్పెండ్ చేయడంతో అక్రమార్కుల్లో వణుకు మొదలైంది. టాస్క్ఫోర్స్ ఏసీపీగా పని చేసిన కళంకిత అధికారితో అంటకాగిన వారిలో భయం పట్టుకుంది.