వినాయక్‌నగర్/బోధన్/వేల్పూర్, నవంబర్10: రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నది. లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇతర రాష్ర్టాలకు తరలిస్తుండగా..కొందరు అక్రమార్కులు గోదాముల్లో నిల్వ ఉంచుతున్నారు. ఆదివారం జిల్లా కేంద్రంతోపాటు వేల్పూర్‌లో పీడీఎస్ బియ్యం నిల్వలను పోలీసులు గుర్తించగా.. బోధన్ పట్టణ శివారు ఆటోనగర్ ఏరియాలో వాహనంలో తరలిస్తున్న 20 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం బస్తాలను పట్టుకున్నారు.
జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్ ప్రాంతంలో ఉన్న ఓ గోదాము నుంచి వాహనంలో పీడీఎస్ బియ్యాన్ని లోడ్ చేస్తుండగా..వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి సిబ్బందితో కలిసి దాడి చేశారు. దాడిలో 23 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొన్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచిన గోదామును ఎండీ సుమేర్ ఖాన్‌దిగా పోలీసులు గుర్తించారు. రేషన్ లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు బియ్యం కొనుగోలు చేసి, ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. పీడీఎస్ బియ్యం దందా చేస్తున్న ఎండీ.సుమేర్ ఖాన్‌తో పాటు బియ్యం తరలిస్తున్న డ్రైవర్ గోడెక్ అజయ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.
బోధన్ పట్టణ శివారు ఆటోనగర్ప్రాంతంలో ఆదివారం బొలేరో వాహనంలో తరలిస్తున్న 20 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని బోధన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు బోధన్ టౌన్ సీఐ వెంకటనారాయణ తెలిపారు. వేల్పూర్‌లోని వజ్రరైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని ఎస్సై నాగనాథ్ గుర్తించారు. 1470 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేసి యజమాని ఎంపల్లి వంశీకృష్ణపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.