బొంరాస్‌పేట, సెప్టెంబర్ 10: డ్రైవర్ వృత్తే ప్రధాన జీవనాధారంగా బతుకుతున్నది ఆ గ్రామం.. 200లకు పైగా మంది డ్రైవర్లుగానే తమ కుటుంబాలను పోషించుకుంటూ ఉపాధి పొందుతున్న ఆ గ్రామం బొంరాస్‌పేట మండలంలోని తుంకిమెట్ల. లారీలు, బస్సులు, కార్లు, ట్రాక్టర్లు, జేసీబీలు, ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వీరిలో ఎంతో మంది లారీలు, కార్లకు ఓనైర్లె రాణిస్తున్నారు. చేతినిండా పని లభిస్తుండడంతో ఈ ఊరు నుంచి వలసలు కూడా లేవు.
కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. జానెడు పొట్ట కోసం మనిషి ఏ పనైనా చేయాలి. వ్యక్తులు వారికి ఉన్న ఇష్టాన్ని, అభిరుచిని బట్టి వివిధ రకాల పనులను ఎంచుకుని వాటిలో స్థిరపడుతుంటారు. చేసే పని చిన్నదైనా కొందరికీ ఆ పనే జీవనాధారంగా మారు తుంది.మండలంలోని తుంకిమెట్ల గ్రామంలో చాలామంది యువకులు డ్రైవింగ్ వృత్తిపైనే ఆధారపడి త మ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇలా ఆ గ్రామంలో నివసిస్తున్న కుటుంబాల్లో చాలామంది డ్రైవర్లుగా మారారు. వారంతా డ్రైవింగ్‌ను ప్రధానవృత్తిగా మార్చుకుని లారీలు, బస్సులు, కార్లు, ట్రాక్టర్లు, జేసీబీలు, ఆటోలు నడుపుతూ జీవిస్తున్నారు. వారి లో కొందరు లారీలు, కార్లకు ఓనర్లయ్యారు.
ప్రత్యామ్నాయం లేకపోవడంతో..
హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై ఉన్న తుంకిమెట్ల గ్రామంలో 380 కుటుంబాలుండగా 962 మంది జీవిస్తున్నారు. అందులో సుమారు 200 మందికిపైగా డ్రైవింగ్ ఫీల్డ్‌ను ఎంచుకున్నారు. ఒక్కో కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు కూడా డ్రైవర్లున్నారు. బతికేందుకు ప్రత్యామ్నాయం లేకపోవడంతో చాలామంది జీవనోపాధి కోసమే డ్రైవింగ్ వృ త్తిని ఎంచుకున్నారు. గ్రామం నుంచి మొదటగా 50 ఏండ్ల క్రితం ముసలిగాళ్ల భాస్కర్ డ్రైవర్‌గా పనిలో చేరాడు. ఆ తర్వాత అబ్దుల్ గఫార్, తోలు వెంకటయ్య, మజీద్ ఇలా ఒకరి తర్వాత ఒక రు చాలామంది డ్రైవింగ్ ఫీల్డ్‌ను ఎంచుకున్నారు. మొదట లారీల్లో క్లీనర్‌గా చేరి డ్రైవింగ్‌ను నేర్చుకున్నారు.
డ్రైవర్లుగా ఓపికగా పనిచేస్తూ 20 మంది సొం తంగా లారీలు, 10 మంది వరకు కార్లు కొనుక్కొని ఓనర్లయ్యారు. 1998లో తోలు వెంకటయ్య ఆర్టీసీలో డ్రైవర్‌గా చేరాడు. జయప్రకాశ్‌గౌడ్ కూకట్పల్లి డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మిగతా వారు కూడా లారీలతోపాటు వివిధ రకాల వాహనాలను నడుపుకొంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. వయసు మీద పడటం, అనారోగ్యం కారణాలతో కొంతమంది ఈ వృత్తికి దూరంకాగా ప్రస్తు తం 200 మందికిపైగా డ్రైవింగ్‌పైనే ఆధారపడి జీవిస్తున్నారు. చిన్న వయసులోనే డ్రైవింగ్ వృత్తిని ఎంచుకున్న చాకలి శ్రీనివాస్ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ప్రస్తుతం రెండు ట్రాక్టర్లు, రెండు సిమెంట్ ట్యాంకర్లకు ఓనరుగా మారాడు.
వలసలు లేని గ్రామం
సాధారణంగా యువత, ఇతర వ్యక్తులు పొట్టకూటి కోసం నగరాలు, విదేశాలకు వలస వెళ్తుంటారు. కా నీ తుంకిమెట్ల నుంచి వలస వెళ్లిన వారు చాలా అరు దు అని చెప్పొచ్చు. ఎక్కువ మంది యువత డ్రైవర్లు గా స్థిరపడగా.. మిగతా కుటుంబాలు ఉన్న ఊర్లోనే వివిధ రకాల పనులను చేసుకుంటూ జీవిస్తున్నాయి.
సంఘంగా ఏర్పడి..
గ్రామంలో డ్రైవర్లుగా పనిచేస్తున్న వారంతా శ్రీసాయి లారీ డ్రైవర్స్ అసోసియేషన్ పేరుతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. తోలు వెంకటయ్య దానికి అధ్యక్షుడిగా ఉన్నారు. సంఘం తరఫున పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. డ్రైవింగ్ వృత్తి అంటేనే రోడ్డుపైన జీవితం. ప్రమాదాలు వెంటాడుతాయి. ఇలా ప్రమాదాలు జరిగి పలువురు డ్రైవర్లు ప్రాణా లను కూడా కోల్పోయారు. ఇలా మృతి చెందిన డ్రైవర్ షబ్బీర్ కుటుంబానికి, ప్రమాదంలో గాయపడ్డ మహిపాల్‌కు, అగ్ని ప్రమాదంలో పూరి గుడిసె కాలిపోయి నిరాశ్రయుడిగా మారిన యాదయ్యకు సంఘం తరఫున ఆర్థిక సాయాన్ని అందించి ఆదుకున్నారు. ఏటా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులను సంఘం తరఫున అందిస్తున్నారు.
డ్రైవింగ్ నేర్చుకుని ఓనరునయ్యా..
2000 సంవత్సరంలో లారీ డ్రైవర్‌గా చేరా. డ్రైవర్‌గా పనిచేస్తూ కొత్త లారీని కొనుగోలు చేశా. ఓనర్ కం డ్రైవరున య్యా. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా కుటుంబాన్ని పోషించుకుంటున్నా. డ్రైవింగ్ రాకుంటే బతుకు కష్టమయ్యేది.
-బల్ల అంజిలయ్యగౌడ్, డ్రైవర్ కం ఓనర్
బతుకుదెరువు కోసమే..
12 ఏండ్లుగా లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిం చుకుంటున్నా. బతుకుదెరువు కోసం వేరే పని లేకపోవడంతో డ్రైవింగ్ నేర్చుకున్నా. ఇప్పటి వరకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవిస్తున్నా.
– మహిపాల్‌గౌడ్, లారీ డ్రైవర్