ఏర్గట్ల/తాడ్వాయి, జనవరి 9: రైతుబీమా పథకం అన్నదాతల కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తున్నది. పెద్ద దిక్కును కోల్పోయి ఆపదలో చిక్కుకున్న వారికి ఆర్థిక చేయూతను అందిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ గుండెల్లోంచి పుట్టుకొచ్చిన ఈ బీమా పథకం రైతు కుటుంబాలకు ఎంతో భరోసానిస్తున్నది. ఈ పథకం ద్వారా ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ఎంతో మందికి లబ్ధి చేకూరింది. ఒక్క తాడ్వాయి మండలంలోనే 2018 నుంచి ఇప్పటివరకు 191 రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందింది. బాల్కొండ నియోజకవర్గంలో 891 రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరింది.
రైతు సంక్షేమమే ధ్యే యంగా పనిచేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం వారి కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలుచేస్తున్నది. వారి శ్రేయస్సు కోసం అనేక కార్యక్రమాలు చేపడుతూ వ్యవసాయాన్ని పండుగలా మార్చింది. ఇం దులోభాగంగా రైతు కుటుంబాలకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం రైతుల కుటుంబానికి కొండంత అండగా మా రింది. గుంట భూమి ఉన్న రైతుకు అవకాశం కల్పించడంతోపాటు బీమా సొమ్మును కూడా ప్రభుత్వమే భరిస్తోంది. బీమా పొందడానికి రైతులు ఒక్క రూపాయి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రమాదం, సాధారణ మరణంతో ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన సమయంలో బీమా సొమ్ము ఆదుకుంటున్నది.
పది రోజుల వ్యవధిలో బీమా సొమ్ము
18 నుంచి 59 ఏండ్ల మధ్య వయస్సు ఉన్న రైతులకు రైతుబీమా వర్తిస్తుంది. రైతు చనిపోతే ఆ కుటుంబంలో నామినీకి పది రోజుల వ్యవధిలోనే రూ. 5లక్షలు అందుతాయి. రైతుబీమా పథకం కింద రైతు మరణం సహజమా లేదా ప్రమాదవశాత్తు సంబంధం లేకుండా బీమా మొత్తం లభిస్తుంది. దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ రైతు కోసం 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాతోపాటు రైతుబంధు, రైతుబీమా పథకాలు అన్నదాతకు అండగా నిలుస్తున్నాయి.
రైతన్నకు అండగా పథకాలు
కేసీఆర్ ప్రభుత్వం అమలుచేస్తున్న ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ సరఫరాతోపాటు రైతుబంధు, రైతుబీమా పథకాలు రైతన్నకు అండగా నిలుస్తున్నాయి. వ్యవసాయాన్ని పండుగలా చేయడంతో అన్నదాతలు సాగువైపు ఆసక్తి చూపుతున్నారు. ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే అనారోగ్యం, సాధారణ, వివిధ కారణాలతో 891 మంది రైతులు మృతి చెందగా బాధిత కుటుంబాలకు రైతుబీమా కింద రూ.44 కోట్ల 55లక్షలు అందాయి. తాడ్వాయి మండలంలో పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 199 మంది రైతులు వివిధ కారణాలతో మృతి చెందగా 191 కుటుంబాలకు రూ.9 కోట్ల 55 లక్షలు నామినీల ఖాతాల్లో జమ అయ్యాయి.
మా కుటుంబాన్ని ఆదుకున్నది..
నా భర్త క్యాతం రవి హఠాన్మరణం చెందారు. దీంతో మా కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది. నా భర్త పేరిట భూమి ఉండడంతో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం నా కుటుంబాన్ని ఆదుకున్నది. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సహకారంతో రైతుబీమా కింద ఐదు లక్షల రూపాయల చెక్కును అందించారు.
– బాలహంస, తాళ్లరాంపూర్, ఏర్గట్ల
నామినీ అకౌంట్లో డబ్బులు జమ
రైతు మరణిస్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతు ఇచ్చిన నామినీ అకౌంట్లలో రైతు బీమా డబ్బులు జమ అవుతాయి. రైతు పేరు మీద గుంట భూమి ఉన్నా రైతు బీమా వర్తిస్తుంది. తాడ్వాయి మండలంలో 2018 నుంచి 2022 వరకు 191 మంది రైతులు మరణించగా బీమా డబ్బులు వారి అకౌంట్లో జమ అయ్యాయి.
-శ్రీకాంత్, ఏవో, తాడ్వాయి