బిచ్కుంద, జూలై 31: వృద్ధులు, దివ్యాంగులకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పింఛన్ కోసం బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన అనంతరం పెన్షన్ కోసం కష్టాలు పడాల్సి వస్తున్నది. కేసీఆర్ హయాంలో ప్రతినెలా సమయానికి పింఛన్ వచ్చేదని, ప్రస్తుతం నెల చివరలో పింఛన్ ఇస్తున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం అందించే డబ్బుల కోసం పోస్టాఫీసుల ఎదుట గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తున్నది. బిచ్కుంద మండలంలో మొత్తం 4,606 మంది పింఛన్దారులు ఉండగా.. బిచ్కుంద మున్సిపల్ పరిధిలో 1,670 మంది ఉన్నారు. వీరందరూ బిచ్కుందలోని పోస్టాఫీసుకు వచ్చి పింఛన్ తీసుకోవాల్సి ఉంటుంది.
బయోమెట్రిక్ తొలగించడంతో ఇబ్బందులు..
పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని తొలగించి, ఫేస్ రికగ్నైజేషన్కు తీసుకువచ్చింది. ముఖం స్కాన్ కావడం లేదు. దీంతో రోజంతా పోస్టాఫీసు వద్దే పడిగాపులు కాయాల్సి వసున్నదని దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రెండు రోజులుగా పింఛన్ పంపిణీ చేస్తుండడంతో ఉదయం ఆరు గంటలకే వచ్చి, గంటల తరబడి వేచి చూసి, తీరా ఫేస్ రికగ్నైజేషన్ కాకపోవడంతో వెనుదిరగాల్సి వస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బిచ్కుంద పోస్టాఫీసు వద్ద గురువారం కొద్దిసేపు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికారులు స్పందించి, తగిన చర్య లు తీసుకోవాలని పింఛన్దారులు కోరుతున్నారు.
పైసలు అయిపోతే.. మేమెటు పోవాలె..?
కేసీఆర్ సార్ టైంల 15రోజుల దాక పింఛన్ ఇచ్చెటోళ్లు. ఇప్పుడేమో నాలుగైదు రోజులే ఇచ్చి, పైసలు అయిపోయినయి, వచ్చినప్పుడు ఇస్తం అంటుండ్రు. పింఛన్ పైసలతోనే మాలాంటి ముసలోళ్లకు దినం గడుస్తది. పైసలు లేకుంటే మేమెటు పోవాలె..?
– జలవ్వ, బిచ్కుంద
ఫేస్ స్కాన్ కాకపోవడంతో ఇబ్బందులు..
ఇంతకుముందు బయోమెట్రిక్ ద్వారా పింఛన్లు ఇచ్చేవాళ్లం. కొందరి బయోమెట్రిక్ సరిగా రాకపోవడంతో ప్రభుత్వం ఫేస్ రికగ్నైజేషన్ విధానం తీసుకువచ్చింది. సిబ్బంది తమ ఫోన్లలో యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఫేస్ స్కాన్ చేసి పింఛన్లు ఇస్తున్నారు. కొన్నిసార్లు ఫేస్ స్కాన్ కాకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో పింఛన్లు ఇవ్వడం ఆలస్యం అవుతున్నది.
– గోపాల్, సబ్ పోస్ట్మాస్టర్, బిచ్కుంద
పొద్దున ఆరుగంటలకే వచ్చి కూసున్న..
పింఛన్ ఇస్తున్నారని తెలిసి పొద్దుగళ్ల ఆరుగంటలకే వచ్చి పోస్టాఫీసు వద్ద కూసున్న. మధ్యాహ్నం అయినా ఇంకా డబ్బు లు ఇవ్వలె. ఇంతకుముందు వేలిముద్ర తీసుకుంటుండె. ఇప్పుడేమో ముఖం ఫొటో తీసుకొని పింఛన్ ఇస్తరంట. ముఖం ఫొటో తీస్తే ఎగిరిపోతున్నది. పాత పద్ధతే బాగుండె.
-పిర్మాబీ, బిచ్కుంద
పోయిన నెలల మూడు రోజులే ఇచ్చిండ్రు..
పోయిన నెలలో మూడు రోజులే పింఛన్ ఇచ్చిండ్రు. జనాలు ఎక్కువగా ఉన్నరని వెళ్లిపోయిన. ఈ నెలల బుధవారం నుంచి పింఛన్ ఇస్తున్నారని తెలిసి పోస్టాఫీసుకు వస్తే డబ్బులు అయిపోయినవని చెప్పిండ్రు. వచ్చినప్పుడు ఇస్తమంటుండ్రు.
– నెల్లూరు శ్రీరాములు, బిచ్కుంద