కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై జనాగ్రహం వెల్లువెత్తుతున్నది. ఎన్నికల ముందర కాంగ్రెస్ ఇచ్చిన అనేక హామీలకు బడ్జెట్లో నిధుల కేటాయింపులు లేకపోవడంతో అన్ని వర్గాల్లో అసంతృప్తి పెల్లుబూకుతున్నది. రూ.3.04 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన రేవంత్ సర్కారు.. నిరుద్యోగ భృతి, పింఛన్ల పెంపు, తులం బంగారం, స్కూటీల పంపిణీ తదితర అనేక హామీలను విస్మరించింది. పీఆర్సీ, డీఏ వంటి ప్రకటనలు లేకపోవడంతో ఉద్యోగులు ఉసూరుమంటుండగా, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి ప్రస్తావన లేకపోవడంతో నిరుద్యోగులు రగిలి పోతున్నారు. అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కాక మాట తప్పిన కాంగ్రెస్ పార్టీపై మహిళలు, యువత, వృద్ధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక బుధవారం రెండోసారి అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రూ.3.04 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రకటించిన ప్రభుత్వం.. ఆరు గ్యారంటీలు సహా అనేక హామీలకు అత్తెసరు కేటాయింపులు చేసింది. ఓట్ల కోసం అన్ని వర్గాలపై భారీగా వరాలు గుప్పించిన కాంగ్రెస్ పార్టీ అమలులో మా త్రం అందరికీ ‘చేయి’చ్చింది. బడ్జెట్లో పద్దులు కేటాయించడం కాదు కదా.. కనీసం ప్రస్తావించక పోవడం ద్వారా వృద్ధులు, మహిళలు, రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లింది.
డిక్లరేషన్లు, హామీలంటూ ఎన్నికల ముందర తెగ హడావుడి చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులూ చేయకుండా మోసగించింది. తాజా బడ్జెట్లోనూ అనేక పథకాల ఊసే ఎత్తలేదు. నూరు రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అని చెప్పి ఓట్లేయించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర దగ్గరకొచ్చినా ఆయా పథకాలను నూరు శాతం అమలు చేయలేక చేతులెత్తేసింది. మహిళలందరికీ రూ.2,500 చొప్పున పెన్షన్ ఇస్తామన్నారు. కానీ బడ్జెట్లో ప్రస్తావనే లేదు. సామాజిక పింఛన్ల పెంపుపై ప్రకటన లేదు. స్కూటీలు అందిస్తామన్న హామీకీ దిక్కులేదు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద తులం బంగారం ఇస్తామన్న హామీపైనా ప్రకటన రాలేదు.
రైతన్నలు, నేతన్నలను కాంగ్రెస్ సర్కారు దగా చేసింది. సగానికంటే ఎక్కువ మందికి ఇప్పటికీ రుణమాఫీ కాలేదు. ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయి ఆటోడ్రైవర్ల కోసంసంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం బడ్జెట్లో ప్రస్తావించనే లేదు. ఉద్యోగులకు సంబంధించి 20 నెలల నుంచి పీఆర్సీ పెండింగ్ బిల్లులు, ఐదు డీఏలు, సీపీఎస్ రద్దు విధానం పై మాటే లేదు. నూతన పీఆర్సీ ప్రకటిస్తామని చెప్పి 20 నెలలు గడిచినా బడ్జెట్లో ఆ ప్రస్తావనే లేదు. కొత్త ఉద్యోగాల భర్తీ గురించి ప్రస్తావన లేకపోవడం, నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించక పోవడంతో నిరుద్యోగుల్లో ఆగ్రహం వెల్లువెత్తుతున్నది. బలహీనవర్గాలకు పెద్దగా నిధులు కేటాయించక పోవడం, గొర్రెలు, చేపల పంపిణీకి సంబంధించి ప్రకటనలు లేకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దళితబంధు ప్రస్తావనే లేదు. విద్యాభరోసా కార్డుల విషయం, అంబేద్కర్ అభయహస్తం పథకానికి సంబంధించి ప్రకటనే లేదు. అనేక హామీలను విస్మరించిన కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసగించింది.
మోర్తాడ్, మార్చి19: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా ప్రజలను వంచించే విధంగా ఉన్నదని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బడ్జెట్ ప్రసంగంపై పెదవి విరిచిన ఆయన.. ఆరు గ్యారంటీలు, 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ వాటిని అమలు చేయలేక చేతులెత్తేసినట్లే ఉన్నదన్నారు. పదేండ్లలో కేసీఆర్ నాయ కత్వంలో వెలిగిన తెలంగాణను 15 నెలల్లోనే అంధకారంలోకి నెట్టేసినట్లుగా బడ్జెట్ ఉందన్నారు. యువవికాసం పేరిట కాంగ్రెస్ నాయకులకు దోచిపెట్టే కాంగ్రెస్ వికాస్ బడ్జెట్‌గా ఉందన్నారు. ఇచ్చిన హామీల అమలుకు నిధుల కేటాయింపును విస్మరించి యువ వికాసం పేరుతో కాంగ్రెస్ నాయకుల వికాసానికి మాత్రం రూ.6 వేల కోట్లు అప్పనంగా అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గ్రామీణాభివృద్ధి, విద్యా, వైద్యం, వ్యవసాయం, సాగు, తాగునీటిరంగం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను విస్మరించారన్నారు.
ఖలీల్‌వాడి, మార్చి 19: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏ ఒక్క వర్గానికీ న్యాయం చేయలేక పోయింది. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకూ పెద్ద పీట్ట వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు చనిపోతే పట్టించుకోవట్లేదు. గురుకులాల్లో విద్యార్థులు చనిపోతే పట్టించుకుంటలేదు. ఆటోడ్రైవర్లు చనిపోయినా స్పందిస్తలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మరీ ఇంత కఠినంగా వ్యవహరిస్తుందా? విద్యా, వైద్య రంగాలకు కేటాయింపులు నిరాశ పరిచింది.
– దాదన్నగారి విఠల్‌రావు, జడ్పీ మాజీ చైర్మన్
భట్టివిక్రమార్క బడ్జెట్ పెద్ద బోగస్ అని మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. దిశానిర్దేశం లేని, ఈ దిక్కుమాలిన బడ్జెట్ రాష్ర్టాన్ని తిరోగమనం పట్టించేలా ఉన్నదన్నారు. రేవంత్‌రెడ్డి సాగిస్తున్న పిచ్చి తుగ్లక్ పాలనకు నిలువెత్తు నిదర్శనమే ఈ బడ్జెట్ అని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీల అమలుకు శాశ్వతంగా ఉప్పు పాతరేశారన్నారు. కాంగ్రెస్ దోపిడీకి తలుపులు తెరిచిన చేతివాటం బడ్జెట్ ఇది అని ఆరోపించారు. అక్కాచెల్లెళ్లకు ప్రతినెలా రూ.2500 చొప్పున ఇస్తామన్న మహాలక్ష్మీ పథకానికి బడ్జెట్లో కేటాయింపులు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
గాంధారి, మార్చి 19: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందర మస్తు హామీలు ఇచ్చింది. కానీ బడ్జెట్లో మాత్రం వాటి గురించి మాట కూడా చెప్పలే. ఇది ప్రజలను మోసం చేయడమే. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించి వెంటనే ప్రారంభించాలి. కల్యాణలక్ష్మి పథకం కింద ఇస్తామన్న తులం బంగారం కూడా వెంటనే ఇవ్వాలి. మాయ మాటలతో గద్దెనెక్కి ఆ తర్వాత గమ్మునుంటామంటే జనం ఊరుకోరు.
– కేతావత్ బలరాం నాయక్, వెంకటాపూర్ తండా, గాంధారి మండలం
డిచ్పల్ల్లి, మార్చి 19 : గత బడ్జెట్ రూ.70 వేల కోట్ల లోటుతో కొనసాగుతున్నప్పటికీ ఈ సంవత్సరం అదనంగా సుమారు లక్ష కోట్లు బడ్జెట్‌ను పెంచుకోవటమనేది అత్యాశే అవుతుంది. భారీగా బడ్జెట్ అంచనాలు ప్రభుత్వాల లక్ష్యాలుగా ఉండడం మంచిదే కానీ ఆ మేరకు వనరుల సృష్టి కూడా జరగాలి. ఈ బడ్జెట్ విద్యారంగాన్ని నిర్వీర్యపర్చింది. విద్యా కమిషన్ ఏర్పాటు చేసి విద్యారంగంలో మౌలికమైన మార్పులు చోటు చేసుకుంటాయని ప్రచారం చేసి, ప్రభుత్వం కేవలం రూ.23,108 కోట్లు కేటాయించి చేతులు దులుపుకొన్నది.
-డాక్టర్ పున్నయ్య, ఎకనామిక్స్ హెచ్‌వోడీ, టీయూ
లింగంపేట, మార్చ్19: కాంగ్రెస్ సర్కారు మహిళలను దారుణంగా మోసం జేసింది. మహిళందరికీ పింఛన్లు ఇస్తాం. ఇప్పుడిస్తున్న పింఛన్లు పెంచుతాం అంటే అందరు నమ్మిండ్రు. కల్యాణలక్ష్మి పథకం కింద లక్ష రూపాలతో పాటు తులం బంగారం ఇస్తామని చెబితే మహిళలంతా నిజమే అనుకుండ్రు. ఓట్లేసి గెలిపిస్తే కాంగ్రెసోళ్లు దారుణంగా మోసం జేసిండ్రు. రూ.4 వేల పింఛన్ అస్తదని ముసలోళ్లు ఎదురు చూస్తుంటే వారి ఆశలపై నీళ్లు జల్లిండ్రు. ప్రభుత్వానికి మహిళల ఉసురు తగుల్తది.
– బండి కవిత, మాజీ సర్పంచ్, బాణాపూర్
వంద రోజులల్ల అన్ని జేస్తామని కాంగ్రెసోళ్లు మస్తు మాటలు జెప్పిండ్రు. అధికారంలకు వచ్చి యాడాదిన్నర దగ్గరకొచ్చింది. ఒక్క హామీ కూడా సక్కగా అమలు చేయకపాయే. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకూ రూ.2500 ఇస్తామన్నారు. విద్యార్థినులకు స్కూటీలు అందిస్తామన్నారు. పథకాలకు ఆశ పడి ఎన్నికల్లో గెలిపిస్తే హామీలకు మంగళం పాడిండ్రు. 15 నెలలల్ల ఒక్కటైనా సరిగ్గా జేసిండ్రా? పింఛన్ల పెంపు మాటలకే పరిమితమాయే. తులం బంగారం అమలు కాకపాయే.
– మాలకమ్మరి మమత, మాజీ సర్పంచ్, ముస్తాపూర్
సుభాష్‌నగర్, మార్చి 19: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్య, వైద్యరంగానికి మరిన్ని నిధులు ఇవ్వాల్సింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం విద్యారంగానికి 15 శాతం, వైద్య రంగానికి 20శాతం నిధులు కేటాయిస్తే బాగుండేది. కేసీఆర్ హయాంలో విద్య, వైద్య రంగాలకు భారీగా నిధులు కేటాయించి, మధ్యతరగతి కుటుంబాలకు విద్య, వైద్య సదుపాయాలకు వెసులుబాటు కల్పించారు. ఎన్నికల్లో గెలుపు కోసం రేవంత్ సర్కార్ ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోక పోవడం శోచనీయం.
– షేర్ల దయానంద్, రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్
తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రాహ్మణ సంక్షేమానికి ఏటా రూ.100 కోట్లు కేటాయించారు. బ్రాహ్మణ సంక్షేమానికి అహర్నిశలు కృషి చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాహ్మణ సంక్షేమాన్ని విస్మరించింది. రెండు బడ్జెట్లలోనూ నిధులు కేటాయించలేదు. విదేశీ విద్యాపథకానికి నిధులు లేక విదేశాల్లో ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు అందోళన చెందుతున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలి.
– శ్రీపాదకుమార శర్మ
డిచ్పల్ల్లి, మార్చి 19: కాంగ్రెస్ మహిళలను, విద్యార్థినులను దారుణంగా మోసగించింది. మహిళలని కోటీశ్వరులుగా తీర్చిదిద్దుతామని అనేకసార్లు చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి మాట లు కోటలు దాటాయి తప్ప ఆచరణలో మా త్రం చిత్తశుద్ధి లోపించింది. 18 సంవత్సరాలు నిండిన యువతులకు ఎలక్ట్రిక్ స్కూటీలను అందిస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. బడ్జెట్లో దాని ప్రస్తావనే లేదు. మహిళల సంక్షేమం కోసం గత ప్రభుత్వం తీసుకొచ్చిన కేసీఆర్ కిట్‌ను రేవంత్ ప్రభుత్వం ఎత్తివేయడం బాధాకరం.
– ద్యారంగుల దీపిక, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షురాలు
బాన్సువాడ, మార్చి 19: విద్యారంగానికి బడ్జెట్లో కేటాయింపులు తక్కువయ్యాయి. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు నిధులు కేటాయిస్తే బాగుండేది. 20 నెలల నుంచి పీఆర్సీ పెండింగ్ బిల్లులు, ఐదు డీఏలు, సీపీఎస్ రద్దు విధానం పై మాటే లేదు. నూతన పీఆర్సీ ప్రకటిస్తామని చెప్పి 20 నెలలు గడిచినా బడ్జెట్లో ఆ ప్రస్తావనే లేదు. ఆయా అంశాలను కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టి అర్నెళ్లలో అమలు చేస్తామని చెప్పిండ్రు. 15 నెలలు గడిచినా ప్రభుత్వానికి పట్టింపులేదు.
– భూనేకర్ సంతోష్, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం
బడ్జెట్లో విద్యాశాఖకు భారీగానే కేటాయింపులు చేసినట్లు కనిపిస్తున్నా గతేడాది కంటే తగ్గింది. విద్యాశాఖ పరిధిలో ఉన్న 26,067 పాఠశాలలను గాలికొదిలేసి యంగ్ ఇండియా రెసిడెన్సియల్ స్కూల్స్ గురించి మాత్రమే ప్రస్తావించారు. గురుకులాల్లో చదివేది 5.5 లక్షల మంది మాత్రమే. ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత బడుల్లో చదివే విద్యార్థులు 16 లక్షలు. బడుగు బలహీన వర్గాలకు చెందిన ఆ పిల్లలకు నాణ్యమైన విద్యనందించడానికి ఈ కేటాయింపులు ఏమాత్రం సరిపోవు. బడుల్లో మౌలిక వసతుల కల్పనకు, మెరుగైన మధ్యాహ్న భోజనం, నాణ్యమైన విద్యనందించడానికి మేనిఫెస్టోలో చెప్పినట్లు విద్యకు 15 శాతం నిధులు కేటాయించాలి.
– మాడవేడి వినోద్‌కుమార్, బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు