నాగిరెడ్డిపేట, జూన్ 24: తాగునీటి ఇబ్బందులు తీర్చాలని డిమాండ్ చేస్తూ నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని గోపాల్‌పేటలో ఉన్న సుభాష్‌చంద్రబోస్ కాలనీవాసులు ఖాళీబిందెలతో సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలో 150నల్లా కనెక్షన్లు ఉండగా వారం రోజులుగా నీటి సరఫరా చేపట్టడం లేదన్నారు. మిషన్ భగీరథ నీరు సైతం రావడం లేదని పేర్కొన్నారు. అధికారులు స్పందించకపోవడంతో నిరసన తెలిపామని, రేపటిలోగా తాగునీరు సరఫరా కానిపక్షంలో రాస్తారోకో చేస్తామని హెచ్చరించారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్ళి కిష్టయ్యను వివరణ కోరగా.. వారం రోజుల క్రితం శక్కర్‌నగర్‌లో 40 ఏండ్ల నాటి ట్యాంక్‌ను కూల్చివేశామని, దీంతో ఒకే ట్యాంకు ద్వారా నీటి సరఫరా చేపడుతున్నామని, గ్రామంలో సగం వరకే సరిపోతున్నాయని తెలిపారు. కొత్త పైప్‌లైన్ ఏర్పాటు చేసే వరకు సమస్య పరిష్కారం కాదని పేర్కొన్నారు. ప్రస్తుతం ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. బోరు మోటరు ద్వారా తాగునీటి సరఫరా చేసి ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు.