నాగిరెడ్డిపేట, జూన్ 24: యూరియా యాప్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు బుధవారం రోడ్డెక్కారు. నాగిరెడ్డిపేట మండలం ధర్మారెడ్డి వద్ద గల ఎల్లారెడ్డి-హైదరాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. యూరియా యాప్‌లో స్టాక్ అప్లోడ్ చేయగానే క్షణాల్లో అయిపోతున్నదని, మరికొందరికి అసలు బుకింగే కావడం లేదని రైతులు మండిపడ్డారు.
తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. నిరక్షరాస్యులైన వారు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన యాప్ ద్వారా యూరియాను ఎలా బుక్ చేసుకుంటారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మందికి స్మార్ట్ ఫోన్లు లేవని, వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. బుకింగ్ చేసుకుందామని యాప్ తెరిచే లోపే స్టాక్ అయిపోతున్నదని మండిపడ్డారు.
యాప్ వల్ల యూరియా దొరికే పరిస్థితి లేదని వాపోయారు. యూరియా యాప్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, పాత విధానంలోనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే భారీ ఉద్యమం లేవదీస్తామని హెచ్చరించారు. రైతుల రాస్తారోకోతో జాతీయ రహదారిపై ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచి పోయాయి. సమాచారమందుకున్న ఎస్సై భార్గవ్‌గౌడ్ రైతులకు సర్దిచెప్పారు. ధర్నాలో సర్పంచ్ లక్ష్మీనారాయణ, ఉప సర్పంచ్ జయరాజ్, రైతులు పాల్గొన్నారు.