బోధన్, జనవరి 25: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది. బోధన్ పట్టణంలో ఆదివారం మైనార్టీ బాలుర గురుకుల భవనం ప్రారంభోత్సవం, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సుదర్శన్‌రెడ్డి కాన్వాయ్ పట్టణంలోని ప్రవేశించగానే, ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణులు అడ్డగించారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గాండ్ల రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఎమ్మెల్యే కారును అడ్డంగించేందుకు దూసుకువచ్చారు.
బీఆర్ఎస్ హయాంలో నిధులు మంజూరై నిర్మించిన పనులకు ప్రారంభోత్సవాలు చేయడమే తప్ప, రెండేండ్లుగా బోధన్ పట్టణంలో కొత్తగా ఒక్క పని ఎందుకు చేపట్టడంలేదని నిలదీశారు. ‘సుదర్శన్‌రెడ్డి గో బ్యాక్’, ‘సుదర్శన్‌రెడ్డి డౌన్-డౌన్’ అంటూ నినాదాలు చేస్తూ కాన్వాయ్‌కు అడ్డుపడగా, ఒక్కసారిగా పోలీసులు, కాంగ్రెస్ నాయకులు కంగుతిన్నారు.
వెంటనే బోధన్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు ఆందోళనకారులు నివారించేందుకు వారిని బలవంతంగా నెట్టివేశారు. నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సుదర్శన్‌రెడ్డి పర్యటన అనంతరం మధ్యాహ్నం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు విడుదలచేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ బోధన్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ మాట్లాడుతూ పట్టణం లోని మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలను బీఆర్ఎస్ హయాంలో మాజీ ఎమ్మెల్యే షకీల్ మంజూరుచేసి, భవన నిర్మాణానికి నిధులు మంజూరుచేశారని తెలిపారు. ఆ భవనానికి తానే ఏదో చేసినట్లుగా సుదర్శన్‌రెడ్డి ప్రారంభోత్సవం చేయడం సిగ్గుచేటన్నారు.
రెండేండ్లుగా సుదర్శన్‌రెడ్డి ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని మండిపడ్డారు. దీంతో తాము నిరసన చేపట్టినట్లు తెలిపారు. బోధన్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ మాజీ ఫ్లోర్ లీడర్ బెంజర్ గంగారాం, బీఆర్ఎస్ కార్మిక విభాగం పట్టణ అధ్యక్షుడు రవిశంకర్‌గౌడ్, నాయకులు జె.శంకర్‌గౌడ్, అడ్లూరి నరేశ్, సాగర్, కన్నూ గౌడ్, ఎన్ఆర్ఐ అహ్మద్, బోదు శంకర్, శివకుమార్, షర్ఫుద్దీన్ పాల్గొన్నారు.