ఆర్మూర్, జూన్2 : తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి జరిగి పేదల జీవితాలలో శాశ్వత వెలుగులు ప్రసారించాలంటే మళ్లీ కేసీఆరే సీఎం కావాలని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం గుత్ప గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన క్రీడా ప్రాంగణాన్ని గురువారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో క్రీడలకు అధిక ప్రాధాన్యతమిస్తూ క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయికెదిగేలా తీర్చిదిద్దుతున్నదన్నారు. గ్రామస్థాయి నుంచే క్రీడాకారుల్లో ప్రతిభను వెలికి తీయడానికి, వివిధ క్రీడల్లో పాల్గొని యువత దేహ దారుఢ్యాన్ని పెంచుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రభుత్వం ప్రతీ గ్రామంలో క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తున్నదన్నారు.
ఇప్పటి వరకు ఆర్మూర్ నియోజకవర్గంలోని మూడు మండలాలలో ఎనిమిది క్రీడా ప్రాంగణాలను ప్రారంభించినట్టు ఆయన పేర్కొన్నారు. స్వరాష్ట్ర సాధన 60ఏండ్ల కల. కేసీఆర్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు 14 ఏండ్లు పోరాడారు. అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకుని సమీకరించి, బోధించి, పోరాటానికి దిగారన్నారు. సకలజనులను ఒకే తాటిపైకి తీసుకువచ్చారు. అంబేద్కర్ స్పూర్తితో, గాంధేయ మార్గంలో రాష్ట్రాన్ని సాధించారన్నారు.
సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆయన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మాస్త ప్రభాకర్, గ్రామ సర్పంచ్ చిన్నయ్య, టీఆర్ఎస్ పార్టీ మాక్లూర్ మండల అధ్యక్షుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.