డిచ్పల్లి, డిసెంబర్ 11 : పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీయూసీఐ ఆధ్వర్యంలో డిచ్పల్లి ఎంపీడీవో కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, మురళి మాట్లాడుతూ.. ధరలు పెరుగుతున్నా పంచాయతీ కార్మికుల వేతనాలు పెరగడంలేదన్నారు. నాలుగు నుంచి ఆరు నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. కనీస వేతనాలు అమలుచేసి, పర్మినెంట్ చేయాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూం ఇండ్ల పథకంలో జీపీ కార్మికులకు తొలిప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
బీమా సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ప్రతినెలా 5వ తేదీలోపు జీతాలు ఇవ్వాలని, రోజుకు 8 గంటలే పనిచేయించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్యదర్శి, సర్పంచుల వేధింపులు ఆపాలన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వెంటనే కార్యాచరణ రూపొందించాలని, లేనిపక్షంలో కార్మికులను ఉద్యమబాట పట్టిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు మోహన్, సాయిబాబా, జీపీ కార్మికులు రమేశ్, గంగాధర్, సాయిలు, గంగారాం, కిషన్, సుజాత, రాజేశ్వర్, నవీన్, సుమన్, శ్రీకాంత్, దుర్గా పోసాని తదితరులు పాల్గొన్నారు.