విద్యా వ్యవస్థలో సమస్యలు పేరుకుపోయాయి. పాలకుల నిర్లక్ష్య వైఖరి పేద, మధ్యతరగతి, సామాన్య కుటుంబాలకు శాపంగా మారింది. అరకొర వసతులు, టీచర్ల కొరత, పాఠ్య పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యం, దుస్తుల కొరత, తాగునీటి ఇబ్బందులు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన సిబ్బందికి వేతనాల చెల్లింపులో జాప్యం పట్టి పీడిస్తున్నాయి. విద్యాశాఖకు ప్రత్యేకంగా మంత్రి లేకపోవడంతో పూర్తిస్థాయిలో సమీక్షించాల్సిన వారు కూడా లేకుండా పోయారు. దీంతో కిందిస్థాయిలో అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తున్నది. గత ప్రభుత్వం విద్యావ్యవస్థలోని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ సామాన్యులకు విద్యను దరిచేర్చారు. పాఠశాల విద్యను మొదలుకొని ఉన్నత విద్య వరకు ప్రాధాన్యమిచ్చారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మాత్రం సర్కారు బడులను పట్టించుకోవడం లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
మానవీయ కోణంలో గతంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకువచ్చిన సీఎం బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమానికి బ్రేకులు పడ్డాయి. 2023లో ప్రారంభమైన ఈ స్కీమ్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపేసింది. ప్రభుత్వ బడుల్లో విద్యనభ్యసించే పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల ఆకలిని తీర్చేందుకు గత ప్రభుత్వం ప్రతి స్కూల్లోనూ టిఫిన్స్ అందించేలా ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం మధ్యాహ్న భోజన పథకం నిజామాబాద్ జిల్లాలో 1180 ప్రభుత్వ స్కూళ్లలో, కామారెడ్డి జిల్లాలో 1011 ప్రభుత్వ బడుల్లో అమలవుతున్నది. దీంతోపాటు ఒకటి నుంచి పదో తరగతి వరకు అల్పాహారం పథకాన్ని గత ప్రభుత్వం అమలుచేసింది. సర్కారు స్కూల్‌కు వెళ్లే వారందరికీ అల్పాహారం, మధ్యాహ్న భోజనం చదువుతోపాటే ఉచితంగానే అందుతుండడంతో తల్లిదండ్రుల్లో ఆనందం వ్యక్తం కాగా దాదాపుగా ఉమ్మడి జిల్లాలో 2లక్షల పైచిలుకు విద్యార్థులకు లాభం చేకూరింది. అధికారం మారడంతోనే కాంగ్రెస్ సర్కారు సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని నిలిపేసింది. అర్ధాకలితో సర్కారు స్కూళ్లకు వచ్చే వారికి ఆకలి బాధలు తప్పడం లేదు. మధ్యాహ్న భోజనం వరకు కడుపు మాడ్చుకొని కూర్చోవాల్సి వస్తున్నది. సీఎం బ్రేక్‌ఫాస్ట్ కొనసాగించడంపై తల్లిదండ్రుల నుంచి విన్నపాలు పెరుగుతున్నాయి. ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారు. అల్పాహారం అందించడంతో డ్రాప్ అవుట్స్ తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కింద విధులు నిర్వహిస్తున్న వంట మనుషులు, సహాయకులకు నెలలుగా పెండింగ్ వేతనాలు చెల్లించడం లేదు. వీరికి నెలకు రూ.3వేలు చొప్పున అందించాల్సి ఉంది. 2024 జనవరి నుంచి జూన్ వరకు 5 నెలలుగా వేతనాలు రాలేదు. పెండింగ్‌లో ఉన్న భోజన బిల్లులు, కోడిగుడ్ల బిల్లులను వెంటనే విడుదల చేయాల్సి ఉండగా జాప్యం చేస్తున్నారు. తొమ్మిది, పదో తరగతికి సంబంధించిన మధ్యాహ్న భోజన బిల్లులు జనవరి, 2024 వరకే అందించారు. మిగిలిన నెలలకు బిల్లులు మంజూరు చేయలేదు. 1 నుంచి 8వ తరగతి వరకు మధ్యాహ్న భోజన బిల్లులు ఏప్రిల్ 2024 వరకు వచ్చాయి. మిగిలిన బిల్లులు రాలేదు. ఎస్జీటీ బదిలీల నేపథ్యంలో ప్రాథమిక పాఠశాలల్లో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడం లేదు. ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత కరెంట్ సరఫరా చేస్తామని గతంలో పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి స్వయంగా హామీ ఇచ్చారు. కానిప్పుడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటికీ తానిచ్చిన హామీని నిలబెట్టుకోలేక పోతున్నాడు. పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఏర్పాట్లు చేస్తామని చెప్పినా ఏదీ కాలేదు. గతంలో జీపీలు నిర్వహించే బాధ్యతను అమ్మ కమిటీలకు అప్పగించగా మాటలకే పరిమితమైంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 1180 స్కూళ్లకు రూ.170కోట్లతో 407 స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎంపిక చేసి చాలాచోట్ల పనులు పూర్తిచేశారు. కామారెడ్డి జిల్లాలో 1011 స్కూళ్లు ఉండగా అందులో 185ప్రాథమిక, 42 ప్రాథమికోన్నత, 124 ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 351 స్కూళ్లలో అభివృద్ధి పనులు దాదాపుగా పూర్తిచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన శరవేగంగా జరగడం లేదు.
మోర్తాడ్, జూలై9: ఐదు నెలల మధ్యాహ్నభోజన ఏజెన్సీ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మోర్తాడ్ మండల విద్యావనరుల కేంద్రం వద్ద మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోపునూరు చక్రపాణి మాట్లాడుతూ అప్పుచేసి మధ్యాహ్న భోజనం పెడుతున్నామని అన్నారు. ప్రభుత్వమే కోడిగుడ్లు, నిత్యావసర సరకులు, గ్యాస్‌ను సప్లయ్ చేయాలని, కార్మికులకు వేతనం రూ.పదివేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ, ఈపీఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు. అనంతరం ఎంఈవో ఆంధ్రయ్యకు వినతిపత్రం అందజేశారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ మండల అధ్యక్షురాలు బాబాయికవిత, పోసాని, వరలక్ష్మి పాల్గొన్నారు.
బోధన్ రూరల్, జూలై 9: రెండు నెలలుగా మధ్యాహ్న భోజన బిల్లులు రావడం లేదు. మూడు నెలల నుంచి గౌరవ వేతనాలను కూడా నిలిపివేశారు. అయినప్పటికీ అప్పులు చేసి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులను మంజురు చేయడంతోపాటు నెలనెలా బిల్లులు సకాలంలో వచ్చేలా చర్యలు తీసుకోవాలి.
బోధన్ రూరల్, జూలై 9: మా పిల్లలను సర్కారు బడికి పంపిస్తున్నాం. గ్రామంలోని పాఠశాలలో ఐదు తరగతులకు కేవలం ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే పని చేస్తున్నారు. దీంతో బోధన కుంటుపడుతుంది. టీచర్ల కొరతతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. కనీసం విద్యావలంటీర్లను నియమించి సిలబస్ ప్రకారం బోధన కొనసాగేలా ప్రభుత్వం కృషి చేయాలి. లేదంటే విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంటుంది.
బోధన్ రూరల్, జూలై 9: కేసీఆర్ ప్రభుత్వం పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఉదయం వేళ అల్పాహారాన్ని అందించింది. ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి పాఠశాలలో అల్పాహారం పెట్టడం లేదు. దీంతో ఉదయం వేళ తినే సమయం దొరకక ఆకలితో పాఠశాలకు వస్తున్నాం. పాఠశాలలో అల్పాహారాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలి.
రోజూ ఉదయం టిఫిన్లు పెట్టాలి. గత సంవత్సరం అల్పాహారం అందించడంతో ఉదయం పాఠశాలకు సకాలంలో వచ్చేవాళ్లం. పాఠశాలల ప్రారంభం నుంచి అల్పాహారం అందుతుందేమోనని ఎదురుచూస్తున్నాం. అల్పాహారం కింద ఇడ్లీ, ఉప్మా, పులిహోరతో పాటు పలురకాల టిఫిన్లు అందించారు. ఇప్పుడు కూడా అలాగే కొనసాగించాలి.
కోడిగుడ్ల బిల్లులు అందకపోయినా, గిట్టుబాటు కాకపోయినా, మెనూ ప్రకారం విద్యార్థులకు గుడ్లు అందిస్తున్నాం. గత జనవరి వరకు కోడిగుడ్ల బిల్లులను అందించారు. సుమారు నాలుగు నెలలు పూర్తయినా కోడిగుడ్లకు చెందిన బిల్లులు అందలేదు. అయినా, విద్యార్థులకు కోడిగుడ్లు అందిస్తూనే ఉన్నాం.మార్కెట్లో ఒక్కో కోడిగుడ్డు రూ.6 నుంచి రూ.7 వరకు పెట్టి కొనుగోలు చేస్తున్నాం. ప్రభుత్వ పరంగా మాకు ఒక్కో గుడ్డుకు రూ.5 వస్తాయి. నష్టంతో అయినా గుడ్డు పెడుతున్నాం. అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తున్నది.
నెలవారీగా సకాలంలో వేతనాలు రాకపోయినా, పనులు చేస్తూనే ఉన్నాం. ఈయేడు మొదటి నుంచి ఇప్పటి వరకు జీతాలు రాలేదు. పనులు వదులుకోలేక, వేతనంతోపాటు అప్పుడప్పుడు ఏజెన్సీ నిర్వాహకులు అందిస్తున్న సహకారంతో పనులు చేస్తున్నా. మాకు ఇచ్చే వేతనం తక్కువే అయినా..సకాలంలో అందితే మంచిగా ఉంటది. ప్రభుత్వం వేతనాలును వెంటనే చెల్లించాలి.
మద్నూర్, జూలై 9: నాలుగు నెలలుగా మధ్యాహ్న భోజన బిల్లులు రాలే దు. 2024 జనవరి వరకు మాత్రమే బిల్లులు వచ్చాయి. ఉపాధ్యాయులను అడిగితే వస్తాయని అంటున్నారు. ఇప్పటి వరకు రాలేదు. బయటి నుంచి అప్పులు తీసుకువచ్చి వండుతున్నాము. సకాలంలో బిల్లులు వస్తే, మాకు ఎలాంటి అప్పులు కావు.
మద్నూర్, జూలై 9: బిల్లులు రాకపోవడంతో అప్పులు చేస్తు న్నాం. నెలనెలా బిల్లులు వస్తే సమస్యలు రావు. అన్నీ తీసుకువచ్చి పెట్టుమంటున్నారు. గుడ్లకు సంబంధించిన బిల్లులు రాలేదు. తాము ఎక్కడి నుంచి తీసుకురావాలి. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తమ బకాయిలను వెంటనే విడుదల చేయాలి.