ఉమ్మడి జిల్లాలో ప్రైవేట్ దవాఖానలు పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నాయి. ఎత్తయిన భవనాల్లో అత్యాధునిక పరికరాలు, అన్ని హంగులతో దవాఖానలు ఏర్పాటు చేస్తూ వైద్య సేవలను ఖరీదుగా మార్చారు. పెద్ద మొత్తంలో ఫీజులు వసూలుచేస్తున్నా సకాలంలో వైద్యం అందించకపోవడంతోపాటు వైద్యం వికటిస్తున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. దీంతో సామాన్యులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తున్నది. ఉమ్మడి జిల్లాలో ఇటీవల నకిలీ వైద్యులు పట్టుబడగా.. తాజాగా అర్హత, శిక్షణ లేనివారు వైద్యం చేయడంతో
రోగులు మృత్యువాత పడిన ఘటనలు వెలుగుచూశాయి.
నిజామాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లాలో నకిలీ వైద్యుల కలకలం రేగగా.. చాలా చోట్ల వైద్యం చేస్తున్న వ్యక్తులకు సరైన అర్హతలు ఉండడంలేదు. తమకు సంబంధంలేని, అవగాహన, నైపుణ్యం లేని అంశంలో జోక్యం చేసుకుంటుండడం రోగుల ప్రాణాల మీదికి తెస్తున్నది. ఉదాహరణకు శస్త్ర చికిత్సకు ముందు రోగికి మత్తు మందును సంబంధిత విభాగంలోని నిపుణులే రోగి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేసి సరైన డోసును అందిస్తారు.
కానీ నిజామాబాద్‌లో ఇందుకు విరుద్ధంగా మత్తు మందు ఎక్కిస్తున్నారు. ఇష్టమొచ్చినట్లుగా ఇతర విభాగాలకు చెందిన డాక్టర్లే మత్తు మందు సూదిని చేత బడుతున్నారు. ఎంత మొత్తంలో, ఏ మోతాదులో ఇస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతం మత్తు మందు డాక్టర్ల కొరత విపరీతంగా వేధిస్తున్నది. ఈ మధ్య కాలంలోనే పేరుమోసిన మత్తు మందు డాక్టర్ కూడా హైదరాబాద్‌కు మకాం మార్చారు. దీంతో అందుబాటులో ఉండే వారి సంఖ్య ఒకరిద్దకన్నా ఎక్కువగా లేదు.
అలాంటప్పుడు రోజుకు పదుల సంఖ్యలో జరుగుతున్న ఆపరేషన్లకు మత్తు మందు ఇస్తున్నదెవరు? అన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. చాలా ఆపరేషన్లలో మత్తు మందు డోస్ ఎక్కువ కావడం, సరైన మోతాదులో ఇవ్వకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తిన సందర్భాలు అనేకం ఉన్నా పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడు. హోదా ఒకటుంటే దవాఖాన లోపల మరో చికిత్స అందిస్తున్నారు. రికార్డుల్లో మాత్రం పేర్లను తారుమారు చేసి రాస్తున్నట్లుగా తెలుస్తున్నప్పటికీ వైద్యారోగ్య శాఖ తనిఖీ బృందాలకు ఇవేమీ కనిపించకపోవడం గమనార్హం.
పైన పటారం..లోన లోటారం..
ప్రైవేట్ దవాఖానల్లో వైద్యం పైన పటారం లోన లోటారం చందంగా మారింది. చూడడానికి కార్పొరేట్ హంగులు, ఆర్భాటాలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ వైద్య సేవల్లో మాత్రం నాణ్యత కనిపించడం లేదు. విపరీతమైన పీఆర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయించుకుని రోగులను ఇబ్బడి ముబ్బడిగా ఇన్ పేషెంట్లుగా చేర్చుకుంటున్నారు. చిన్న సమస్యతో వస్తే నానా రకాల భయాలు జొప్పించి రూ.లక్షల్లో బిల్లులు వేసి జేబులు గుల్లా చేస్తున్నారు. కొన్ని కేసుల్లో చిన్నపాటి సమస్యతో వస్తే ఏకంగా ప్రాణాలే పోతున్నాయి. ఇలాంటి ఘటనలు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని ప్రైవేటు దవాఖానల్లో తరచూ వెలుగు చూస్తున్నాయి.
వెన్నుపూస శస్త్ర చికిత్స కోసం వచ్చిన ఓ మహిళ మృతి చెందిన ఘటన వెలుగు చూడడంతో ఇప్పుడు మరోసారి ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో ఏం జరిగిందో ఏమో కాని ప్రైవేటు దవాఖానల్లో కాలు పెట్టాలంటేనే జనాలు జంకే పరిస్థితి ఏర్పడింది. ప్రైవేటు దవాఖానల ఆగడాలపై కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు చొరవ తీసుకుని తనిఖీలకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. సాధారణ ప్రసవాల విషయంలో పూర్వ కలెక్టర్ నారాయణ రెడ్డి అద్భుతమైన చొరవ తీసుకున్నారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి దవాఖాన నిర్వాహకులను దారికి తీసుకువచ్చారు. నారాయణ రెడ్డి మాదిరిగా ప్రస్తుత కలెక్టర్ స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజలకు మేలు చేసే విధంగా ప్రైవేటు దవాఖానలకు ముకుతాడు వేసి తనదైన మార్క్‌ను చూపించాలని వేడుకుంటున్నారు.
వైద్యారోగ్య శాఖ లోపాల పుట్ట
నిజామాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖ లోపాల పుట్టగా మారింది. తనిఖీలు లేకపోవడంతో ప్రైవేటు దవాఖానల్లో దోపిడీ తంతుకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. దీంతో సామాన్యులు దోపిడీకి గురవుతున్నారు. అసలు ప్రైవేట్ దవాఖానల్లో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. వైద్య సేవల్లో లోపాలు బహిర్గతమైతే సామాన్యులకు అనేక చట్టాలు అనుకూలంగా ఉన్నాయి. వైద్య నిర్లక్ష్యంతో ప్రాణ నష్టం జరిగినట్లు ఫిర్యాదు అందిన వెంటనే తెలంగాణ వైద్యారోగ్య శాఖ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. డీఎంహెచ్‌వో ఆధ్వర్యంలో స్వతంత్ర విచారణ సంఘం ఏర్పాటు చేయాలి. ఈ సంఘం దవాఖాన రికార్డులు, చికిత్స ప్రక్రియ, సిబ్బంది నిర్వహణను పరిశీలిస్తుంది. ఆరు రోజుల క్రితం వివాహిత మృతి కేసులో డిప్యూటి డీఎంహెచ్‌వో ఆధ్వర్యంలో పరిశీలన చేపట్టారు.
దవాఖాన లైసెన్స్, వైద్య సౌకర్యాలు, సిబ్బంది అర్హతలను ఈ విచారణ కమిటీ తనిఖీ చేస్తుంది. నిర్లక్ష్యం నిరూపితమైతే, దవాఖాన లైసెన్స్ సస్పెండ్ చేయవచ్చు. జరిమానా కూడా విధించవచ్చు. ఆరోగ్య శ్రీ లేదా ఇతర ప్రభుత్వ పథకాల కింద చికిత్స జరిగినతే ఆరోగ్య శ్రీ ట్రస్ట్ లేదా జిల్లా వైద్యారోగ్య శాఖలో ఫిర్యాదు నమో దు చేయవచ్చు. వైద్య సిబ్బంది ఈ అంశంలో నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్, బదిలీ లేదా శాఖాపరమైన చర్యలు తీసుకోవచ్చు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 106(1) ప్రకారం ఎవరైనా నిర్లక్ష్యం లేదా హఠాత్తు చర్య వల్ల మరణం సంభవిస్తే ఏడేండ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు.
వైద్యసేవల్లో లోపాలపై ఫిర్యాదు చేస్తే చర్యలు
ప్రైవేటు దవాఖానల్లో వైద్యంవల్ల ఎవరికైనా ఇబ్బందులు తలెత్తినా, లోపాలు వెలుగు చూసినా వైద్యారోగ్య శాఖకు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టి సదరు ప్రైవేటు దవాఖానపై చర్యలు తీసుకుంటాం. డాక్టర్ లైసెన్సు రద్దు కోసం చర్యలు కూడా చేపడతాం. ఈమధ్యే చోటుచేసుకున్న ఓ వివాహిత మృతిపై మాకు ఇప్పటి వరకు ఫిర్యాదు రాలేదు. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు మా నిపుణుల బృందం దవాఖానకు వెళ్లి పూర్తి వివరాలను సేకరిస్తున్నది.
– రాజశ్రీ, వైద్యారోగ్య శాఖ అధికారిణి, నిజామాబాద్ జిల్లా