రుద్రూర్, ఆగస్టు 26: ఉమ్మడి జిల్లాలో వరి అధిక విస్తీర్ణంలో సాగవుతున్నది. వరి పంట ప్రస్తుతం చాలా చోట్ల పిలక దశలో ఉన్నది. ప్రస్తుత వాతావరణ పరిస్థితును బట్టి వరిపంటను ఎండాకు తెగులు అధికంగా ఆశిస్తున్నది. వానకాలం పంటలో సాధారణంగా చీడపీడలు ఆశించడంతో దిగుబడులు తగ్గి రైతులు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. సాధారణంగా ఈ తెగులు దీర్ఘకాలిక రకాలను వరి పంట దుబ్బుకట్టే దశలో.. ముఖ్యంగా సన్నగింజ రకాల్లో ఆశిస్తుంది. ఆలస్యంగా నాట్లు వేసిన ప్రాంతాల్లో ఈ తెగులు ఆశించే అవకాశాలు ఎక్కువ. ఎండాకు తెగులు నివారణకు ఎలాంటి మందులు లేని కారణంగా లక్షణాలను తొలిదశలోనే గుర్తించి సమగ్ర యాజమాన్య చర్యలను పాటించి, పంట నష్టపోకుండా కాపాడుకోవడం ఉత్తమం. తెగులు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శాస్త్రవేత్తలు పలు సూచనలు చేస్తున్నారు.
ఎండాకు తెగులు లక్షణాలు..
ఎండాకు తెగులు ఆశించినప్పుడు ఆకుమీద పసుపు రంగు నీటి మచ్చలు ఏర్పడి, అంచుల వెంబడి అలల మాదిరిగా పైనుంచి కిందికి వ్యాప్తిస్తాయి. ఈ తెగులు సోకిన పంటను ఉదయం వేళ పరిశీలిస్తే ఆకుల నుంచి పచ్చని జిగురు పదార్థం పైకి వస్తుంది. ఈ పదార్థం సూర్యరశ్మికి గట్టిబడి చిన్న చిన్న ఉండలుగా మారి, గాలి వీచినప్పుడు ఆకు నుంచి నీటిలోకి, ఇతర మొక్కలకు, ప్రధాన పొలానికి వ్యాప్తిస్తుంది. వరిపైరు ఈనే దశలో తెగులు ఆశించట్లయితే ఆకుల్లో హరిత పదార్థం తగ్గడం ద్వారా వెన్నులు పాక్షికంగా మాత్రమే బయటికి వస్తాయి. అంతేకాకుండా గెలలు పాలుపోసుకోక తాలు గింజలుగా మారిపోతాయి. ఈ తెగులు లక్షణాలు కొంచెం పోషక పొలాలకు దగ్గరగా ఉంటాయి. చెట్ల నీడలో ఉన్న పంటలో ఈ తెగులు లక్షణాలను ఎక్కువ గమనించవచ్చు. రైతులు ఈ లక్షణాలను గమనించి వెంటనే శాస్త్రవేత్తలను సంప్రదించడం ఉత్తమం.
వరిని ఆశించడానికి కారణాలు..
గాలిలో తేమ అధిక శాతం ఉండడం, ఎడతెరిపి లేకుండా చిరుజల్లులు కురవడం, అధిక వేగంతో గాలులు వీచే సమయంలో సగటు ఉష్ణోగ్రత 22 నుంచి 26 సెంటిగ్రేడ్ మధ్య ఉండడం ద్వారా ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం రైతులు సాగుచేస్తున్న దీర్ఘకాలిక, స్వల్పకాలిక సన్న, దొడ్డు రకాలకు బ్యాక్టీరియా, తెగుళ్లను తట్టుకునే శక్తి లేకపోవడంతో ఎండాకు తెగులు ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. రైతులు అధిక మోతాదులో నత్రజని ఎరువులను వినియోగించడం ద్వారా కూడా ఈ తెగులు ఎక్కువ ఆశిస్తుంది.
యాజమాన్య పద్ధతులు..
ఎండాకు తెగులు ఎక్కువగా ఆగస్టు మాసంలో ఆశిస్తుంది. కావున పొలాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఎండాకు తెగులు లక్షణాలు 5 శాతం కన్నా ఎక్కువగా ఉంటే నత్రజని ఎరువును వేయడం నిలిపివేయాలి. సాగునీటి ద్వారా ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది. కావున తెగులు ఆశించిన పొలం నుంచి ఇతర పొలాల్లోకి నీరు పారించవద్దు. పొటాష్ ఎరువును దమ్ములో, ఆఖరి దఫాగా ఎకరాకు 15కిలోలు విధిగా వేయాలి. ప్రతి సంవత్సరం ఈ తెగులు స్థానికంగా ఆశిస్తున్నట్లు గమనిస్తే.. ఆ ప్రాంతంలో ఈ తెగులును తట్టుకునే ఇట్రాస్ట్ సాంబా మసూరి రకాన్ని సాగుచేయాలి. తెగులు లక్షణాలు దుబ్బు కట్టే దశ నుంచి చిరుపొట్ట దశలో గమనించినట్లయితే కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములతోపాటు ప్లాంటామైసిన్ లేదా పోషామైసిన్ 0.4 గ్రాములు లీటరు నీటితో కలిపి పిచికారీ చేస్తే తెగులు వ్యాప్తిని నియంత్రించవచ్చు. ఈ తెగులు పూర్తిగా నివారించడానికి ఎలాంటి మందులు అందుబాటులో లేవని, రైతులు సమగ్ర ఎరువుల యాజమాన్యంతోపాటు ముందస్తుగా సస్యరక్షణ చర్యలు చేపట్టాలని రైతులకు శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
కాండం తొలిచే పురుగుతో అప్రమత్తంగా ఉండాలి
ఖలీల్‌వాడి, ఆగస్టు 26 : ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా వరి పంటను కాండం తొలిచే పురుగు ఆశించే అవకాశం ఉన్నదని వ్యవసాయాధికారుల సూచిస్తున్నారు. కాండం తొలిచే పురుగు నారుమడి నుంచి ఈనిక దశ వరకు ఆశిస్తుందని తెలిపారు. కాండం తొలుచు పురుగు నివారణకు ఎకరాకు కార్బోప్యురాన్ 3జీ గుళికలు 10 కేజీలు లేదా 4 కిలోల క్లోరాంట్రానిలిప్రోల్ 0-4జీ గుళికలు చల్లాలని తెలిపారు. పంట నాటు వేసి 30 రోజులు దాటితే కార్టప్ హైడ్రోక్లోరైడ్ 50 ఎస్పీ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని, తాటాకు తెగులు నివారణకు ప్రొఫెనోపాస్ 2 మి.గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని, బ్యాక్టీరియా ఎండు తెగులు ఆశించినట్లయితే లీటరు నీటికి 0.2 గ్రాముల ప్లాంటామైసిన్ లేదా పోషామైసిన్ +3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ పిచికారీ చేయాలని వివరించారు.
శాస్త్రవేత్తలను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
ఎండాకు తెగులు నివారణ కోసం రైతులు మందుల కోసం చూడకుండా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పొలంలో ఎండాకు తెగులు లక్షణాలను గుర్తించిన వెంటనే దగ్గరలో ఉన్న శాస్త్రవేత్తలను సంప్రదించి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుత కాలంలో రైతులు ఎండాకు తెగులు విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
– విజయ్‌కుమార్, కేవీకే సస్యరక్షణ శాస్త్రవేత్త