ఎల్లారెడ్డి రూరల్/ గాంధారి, ఫిబ్రవరి 20: ప్రభుత్వ దవాఖానలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలతో ఒక రిపోర్టు తయారుచేయాలని ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావ్ అధికారులను ఆదేశించారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ దవాఖానను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. సూపరింటెండెంట్ డాక్టర్ రవీంద్ర మోహన్‌తో మాట్లాడుతూ దవాఖానపై ఫిర్యాదులు వస్తున్నాయని, రోగులపట్ల శ్రద్ధ కనబరచాలన్నారు. సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఎల్లారెడ్డి పట్టణంలోని క్యాంపు కార్యాలయంతోపాటు లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి, తాడ్వాయి మండలాల్లో పర్యటించిన ఎమ్మెల్యే మదన్మోహన్ పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఎల్లారెడ్డిలో 94 మంది, లింగంపేటలో 127 మందికి పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో ఆర్డీవో మన్నె ప్రభాకర్, ఎల్లారెడ్డి జడ్పీటీసీ ఉషాగౌడ్, లింగంపేట ఎంపీపీ గరీబున్నీసా, జడ్పీటీసీ శ్రీలత , అధికారులు పాల్గ్నొనారు.