Pre-arrest | శక్కర్ నగర్ : నిజామాబాద్ జిల్లా కేంద్రానికి కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా రాక సందర్భంగా ఆదివారం బోధన్ పట్టణానికి చెందిన పలువురు వామ పక్ష పార్టీల నాయకులను పోలీసులు తెల్లవారుజామున అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బండారు మల్లేష్, సీపీఎం నాయకులు జమ్మిశెట్టి శంకర్ గౌడ్, యేశాల గంగాధర్, పీడీఎస్యూజిల్లా అధ్యక్షుడు గౌతమ్ కుమార్ తదితరులను అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా సదరు నాయకులు మాట్లాడుతూ పసుపు బోర్డు రైతాంగ పోరాటాలతోనే వచ్చిందని, బీజేపీ చేసిందేం లేదన్నారు. తమ అరెస్ట్ లు అక్రమమని, ప్రశ్నించే గొంతులు నొక్కే యత్నం చేయడం, ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కే చర్య అని ఆరోపించారు. అర్ధరాత్రి నుంచి అరెస్ట్ చేసి భయబ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు.
తాము కామ్రేడ్ డీవీకే వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ కు వెళ్లాల్సి ఉండగా బలవంతపు అరెస్ట్ లు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సదరు నాయకులను ఆదివారం మధ్యాహ్నం స్వంత పూచికత్తుపై పోలీసులు విడుదల చేశారు.