కంఠేశ్వర్, జూన్ 24: సమస్యల పరిష్కారానికి నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం అర్జీదారులతో కిక్కిరిసింది. నిజామాబాద్ సమీకృత కార్యాలయ సమావేశమందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి పెద్ద సంఖ్యలో అర్జీదారులు తరలివచ్చారు. దీంతో సమావేశ మందిరం నుంచి బయటి వరకు ప్రజలు బారులుతీరి కనిపించారు. అదనపు కలెక్టర్లు కిరణ్‌కుమార్, అంకిత్, నగర పాలక సంస్థ కమిషనర్ మకరంద్, డీఆర్డీవో సాయాగౌడ్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 164 వినతులు వచ్చాయని, వాటిని సత్వరమే పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులకు సూచించారు. అంతకు ముందు నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు అజ్మీరా రాంజీ అకాల మృతిపై అధికార యంత్రాంగం సంతాపం తెలిపింది. పెండింగ్‌లో ఉన్న కళాశాల విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ప్రైవేటు కళాశాలల సంఘం నాయకులు అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
ప్రజావాణి కార్యక్రమానికి అర్జీదారులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో అధికారులు వినతులు స్వీకరించేందుకు కొంత ఆలస్యమయ్యింది. మధ్యాహ్నం 1.30గంటలకు అధికారులు సమావేశ మందిరం నుంచి వెళ్లిపోవడంతో కొంతమంది ఫిర్యాదుదారులు నిరాశతో వెనుదిరిగారు. మరికొంత మంది సమావేశ మందిర ద్వారం వద్ద ఎదురుచూసినా.. అక్కడ ఉన్న సిబ్బంది సమయం అయిపోయిందని, అధికారులు లేరని చెప్పారు. దీంతో ఫిర్యాదుదారులు వెనుదిరిగి వెళ్తున్న క్రమంలో అప్పుడే బయటికి వెళ్తున్న అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్‌ను కలిసి అర్జీలు సమర్పించారు.
ప్రజావాణి సమయం మధ్యాహ్నం ఒంటి గంట వరకే. కానీ రెండు గంటలవరకు ఫిర్యాదులు స్వీకరించాం. సమయానికి లోపలికి వచ్చినవారి ఫిర్యాదులన్నీ తీసుకున్నాం. ఫిర్యాదుదారులు సమావేశ మందిరంలోనికి రాకపోతే ఏం చేస్తాం.