ఆర్మూర్‌టౌన్, డిసెంబర్ 7: కాంగ్రెస్‌ది అవినీతి, బీజేపీది దుర్నీతి అని.. ప్రజల బాధలు పట్టని బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి ఆర్మూర్‌కు శాపంగా మారాడని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో స్వర్ణయుగంగా విరాజిల్లిన ఆర్మూర్ నియోజకవర్గం.. కాంగ్రెస్ సర్కార్ దిక్కుమాలిన పాలనలో పురోగతి కోల్పోయి అధోగతి పాలయ్యిందని మండిపడ్డారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన తాను ఆర్మూర్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఆయన ఆర్మూర్‌లోని తన నివాసంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు ఆర్మూర్ అభివృద్ధికి అణాపైసా తేలేని దద్దమ్మలని, బీజేపీకి ఓటేసినందుకు ప్రగతికి చేటుగా పరిణమించిందని ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు ఆవేదన చెందుతున్నారని అన్నారు.
కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వగా.. వారు జనం కండ్లల్లో కారం కొట్టారని నిప్పులు చెరిగారు. కేసీఆర్ పందేండ్ల పాలనలో సుమారు మూడు వేల కోట్లు నిధులు తెచ్చి ఆర్మూర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా తీర్చిదిద్దినట్లు తెలిపారు. నియోజకవర్గంలో చేపట్టిన పథకాలన్నీ తొలి సీఎం కేసీఆర్ ఇచ్చినవేనని, బీఆర్ఎస్ హయాంలో మంజూరైన పథకాలను తామే తెచ్చామని కాంగ్రెస్ గ్లోబల్ ప్రచారం చేసుకుంటున్నదని మండిపడ్డారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఆర్మూర్ నియోజక వర్గానికి ఒక్క విద్యుత్ సబ్సిడీలే రూ.320 కోట్లు వచ్చాయని, నియోజక వర్గంలో 62 వేల మందికి రూ.2,016 పింఛన్ అందజేశామన్నారు. 62 వేల మందికి రైతుబంధు ద్వారా పెట్టుబడి సహాయం అందించామని, అంబేద్కర్, జగ్జీవన్ రామ్ చౌరస్తాలను సుందరీకరించామని, 12 వందల మందికి దళిత బంధు ద్వారా రూ.10లక్షల చొప్పున ఆత్మ గౌరవ పథకాలను అమలు చేశామని చెప్పారు.
వివిధ కులాలకు 17 ఫంక్షన్ హాళ్లను నిర్మించామని, 50వేల టిప్పర్లతో మొరం తొలిచి, సిద్ధుల గుట్టకు రూ.20 కోట్లతో ఘాట్ రోడ్ వేయించి, సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేశామన్నారు. దేశంలోనే అద్భుతమైన శివాలయంగా పర్యాటక స్థలంగా తీర్చిదిద్దామని చెప్పారు. రూ.120 కోట్లతో పంచగూడ వంతెన కట్టించి నిజమాబాద్-నిర్మల్ జిల్లాల మధ్య 93 కిలోమీటర్ల దూరాన్ని తగ్గించామన్నారు. ఆర్మూర్ నియోజకవర్గం మొత్తం రూ.500 కోట్లతో రోడ్లు వేయించామని, ఆర్మూర్ పట్టణంలోనే రూ.వంద కోట్ల వ్యయంతో రోడ్లు నిర్మించామని చెప్పారు.
పందేండ్లపాటు పెంచిన చెట్లను ఆర్మూర్ నియోజక వర్గ కాంగ్రెస్ ఇన్చార్జి వినయ్ రెడ్డి తన బొమ్మ కనపడాలని ప్రచార యావతో నరికించడం దారుణమని ధ్వజమెత్తారు. రెండు పార్టీల నాయకులు తప్పులు ఒప్పుకొని ప్రజల ముందు నేలకు ముక్కు రాసి క్షమాపణ చెప్పాలన్నారు. రెండు పార్టీల అక్రమాలు, తప్పుడు పనులకు తన నివాసంలో ఏర్పాటు చేసిన జనతా గ్యారేజ్‌లో రిపేరు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్‌ను మూడో సారి ముఖ్యమంత్రిని చేసేంత వరకు ప్రజల మధ్యన ఉంటానని శపథం చేశారు. జిల్లా అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నాయకులు రాజేశ్వర్ రెడ్డి, పోల సుధాకర్, పూజ నరేందర్, మీరా శ్రవణ్, పృథ్వీ గణేశ్, లతీఫ్, అజీమ్, రహమద్, సత్తర్ పాల్గొన్నారు.