ధర్పల్లి, అక్టోబర్ 7 : విద్యుత్ సబ్‌స్టేషన్‌లో తలెత్తిన సమస్యలతో మండలకేంద్రంలో తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా నిలిచినపోవడంతో జనజీవనం స్తంభించినంత పనైంది. తాగునీరు రాకపోవడంతో మండలకేంద్ర ప్రజ లు ఉదయం నుంచే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భవానీ మాలధారు లు స్నానం చేద్దామంటే నీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పలువురు సబ్‌స్టేషన్ చేరుకొని, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ రోజంతా కరెంట్ పోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతవరకు తాగడానికి నీరు లేక ప్రైవేట్ ప్లాంట్లు, షాపులను ఆశ్రయించి నీటిని కొనుగోలు చేశారు. చార్జింగ్ లేక సెల్ఫోన్లు సైతం మూగబోయాయి. ఉదయం 5.30 గంటలకు విద్యుత్ సరఫరా నిలిచిపోగా సుమారు సాయంత్రం 4 గంటలకు కరెంట్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. సబ్‌స్టేషన్‌లో మళ్లీ సమస్య తలెత్తగా సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గం టల వరకు సరఫరా నిలిచిపోయింది.
విద్యుత్ శాఖ డీఈ ఉత్తంకుమార్, ఏడీ శ్రీనివాస్ సబ్‌స్టేషన్‌తో మరమ్మతులు చేయించారు. రాత్రి 7 గంటల కు సరఫరా పునరుద్ధరించినా, స్థానిక గాంధీచౌక్ ప్రాంతంలో మాత్రం రాత్రి 9 గంటలకు విద్యుత్ సరఫరా చేశారు. దీనిపై మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని సీతాయిపేట్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొనగా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాన్స్‌కో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఏ సమస్య వచ్చినా సకాలంలో స్పందించడం లేదని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.