మోర్తాడ్, ఫిబ్రవరి 22: ఇసుకను తక్కువ ధరకే ప్రజలకు అందిస్తున్నామని కాంగ్రెస్పార్టీకి చెందిన ఓ నాయకుడు సోషల్మీడియాలో పోస్టు చేసిన రోజే బట్టాపూర్ పెద్దవాగులో అధికారులు దాడులు చేశారు. అక్రమంగా ఇసుక తవ్వుతున్న జేసీబీతోపాటు ఇసుకను తరలించేందుకు సిద్ధంగా ఉన్న ఆరు ట్రాక్టర్లను పట్టుకున్నారు.
ఒకవైపు అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపాలని, దీనిపై జిల్లా కలెక్టర్లు, సీపీలు దృష్టిసారించాలని సీఎం రేవంత్రెడ్డి చెప్పడం, జిల్లాలో ఇసుక దోపిడీపై కఠినంగా వ్యవహరించాలని సీపీ ఆదేశాలు జారీ చేసినా.. మరోవైపు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడడం ఎవరి లాభం కోసమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
పెద్దవాగులో ఏడాది కాలంగా ఇసుక అక్రమ తవ్వకాలు చేపడుతుంటే దాన్ని ప్రోత్సహిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు సోషల్మీడియాలో పోస్టులు పెట్టడం, ఇసుక తరలిస్తున్న వాహనాలు పట్టుబడడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇలా ఎప్పుడు జరగలేదని ఇటు ప్రజలు, ఏం చేయాలో ఏం మాట్లాడాలో తెలియడంలేదని కొందరు అధికారులు పేర్కొనడం గమనార్హం. స్వయంగా సీఎం ఇసుక దోపిడీపై ఉక్కుపాదం మోపుతామని చెప్పిన నేపథ్యంలో బాల్కొండ నియోజకవర్గంలో మాత్రం అక్రమ తవ్వకాలు చేపడుతూ ప్రజల కోసమేనని పోస్టులు పెట్టడం అభాసుపాలు కావడం తప్ప ఒరిగేదేమీ లేదని ప్రజల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.