నిజామాబాద్, ఆగస్టు 22, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నిజామాబాద్ జిల్లా పర్యటనలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇలా వచ్చి అలా వెళ్లి పోయా రు. శనివారం రోజంతా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతోనే కాలం గడిపారు. కానీ ఎక్క డా తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో జరుగుతున్న 22ఏ వివాదంపై నోరు విప్పలేదు. కలెక్టరేట్లో సమీక్ష చేసిన అనంతరం మీడియాతో మాట్లాడినప్పటికీ తాము కేవలం ప్రజలకే జవాబుదారీగా ఉంటామంటూ చెప్పుకొచ్చారు. భూ వివాదం చుట్టుముడుతున్న వేళా క్లారిటీ ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఇన్ఛార్జీ మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొనసాగుతున్నారు.
వరంగల్ రాజకీయాల్లో పొంగులేటి వర్సెస్ కొండా సురేఖ అన్నట్లుగా రాజకీయ వ్యవహారాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కొండా కుటంబ వివాదం కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సుష్మితా పటేల్ చేస్తోన్న అవినీతి ఆరోపణలు, ఇతర తీవ్రమైన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీని ముచ్చమటలు తెప్పిస్తోన్న ఈ కీలక అంశాలపై పొంగులేటి నోరు విప్పుతారని అంతా ఆశించారు. రోజంతా వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటికీ పౌరసంబంధాల శాఖ మంత్రిగా హోదాలోనైనా 22ఏ వివాదంపై విధానపరమైన అంశాలను వెల్లడిస్తారని అంతా ఆశించగా అలాంటిదేమీ జరగలేదు.
కాంగ్రెస్ మంత్రులకు అధికార బీజేపీ పార్టీపై మాట్లాడేందుకు నోరు రాకపోగా అడుగడుగునా బీఆర్ఎస్పైనే అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో గత ప్రభుత్వంలో ఏమీ జరగలేదంటూ పొంగులేటి మాట్లాడటంపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. సమీక్షా సమావేశాల్లో పొంగులేటితో పాటు వేదికను పంచుకున్న ప్రభుత్వ సలహాదారుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి సాక్షిగా బాన్సువాడ నియోజకవర్గంలో 11వేల డబుల్ బెడ్ ఇళ్లు నిర్మాణం జరిగింది. అర్హులైన కుటుంబాలకు పంపిణీ సైతం పారదర్శకంగా పూర్తి చేశారు. ఇవేవి గుర్తించకుండానే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజకీయ విమర్శలు గుప్పించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం గణనీయంగా జరిగినప్పటికీ అసత్యాలు చెప్పారంటూ పలువురు భావిస్తున్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీని ఒక్క విమర్శ కూడా చేయలేదు. సరికదా బీజేపీ ఎంపీ అర్వింద్పైనా నోరు విప్పలేదు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ధర్మపురి అర్వింద్ నోటికొచ్చినట్లుగా ధూషించారు. ఏకవచనంతో మాట్లాడుతూ హేళన చేశారు. అయినప్పటికీ పొంగులేటి సమాధానం ఇవ్వకపోగా గత బీఆర్ఎస్ సర్కారుపైనే విమర్శనాస్ర్తాలను సంధించేందుకు అడుగడుగునా తాపత్రయపడ్డారు. సీఎం అమెరికా టూర్ రద్దు నేపథ్యంలో కేంద్రంపై పొంగులేటి విమర్శలు చేస్తారని ఊహించగా మోనంగానే ఉండిపోయారు. రేవంత్ రెడ్డి అమెరికా టూర్‌పై బీజేపీ ఎంపీ అర్వింద్ అనేక అనుమానాలు రేకెత్తించాడు. విదేశీ పర్యటనలో దేశ ద్రోహులతో సీఎం భేటీ అయ్యారని మండిపడ్డప్పటికీ ఎవ్వరూ స్పందించకపోవడం విశేషం.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేంద్రంగా జరుగుతోన్న భారీ వివాదాల నడుమ నిజామాబాద్ జిల్లాలో రెవెన్యూ మంత్రి ప్రోగ్రామ్ జరగడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది. బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి కుటుంబీకుల ఆధ్వర్యంలో నిర్మించిన ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవానికి శుక్రవారమే పొంగులేటి వచ్చారు. ఆ తర్వాత శనివారం నాటి కార్యక్రమం అకస్మాత్తుగా ఏర్పాటైందా? అంతకు ముందే నిర్ణయించారా? అన్నది అనుమానాలకు తావిస్తోంది.
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అప్పటికప్పుడు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నిజామాబాద్‌కు చేరుకోవడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. హైదరాబాద్, వరంగల్ పర్యటనలో తాజా వివాదాలపై నోరు విప్పాల్సి వస్తుందనే కారణంతో నిజామాబాద్ వైపు వచ్చి రివ్యూలతో కాలం గడిపినట్లుగా కాంగ్రెస్ వర్గాల్లోనే తీవ్ర చర్చ నడుస్తోంది. మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా వ్యవహరిస్తోన్న వరంగల్ జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి సీతక్క గైర్హజరయ్యారు. అకస్మాత్తుగా పొంగులేటి టూర్ నిర్ణయించడంతోనే సీతక్కకు సమయం దొరకలేదని తెలుస్తోంది.