నిజామాబాద్ క్రైం, ఆగస్టు 9 : రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం జిల్లా కేంద్రంలో పర్యటన సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఇన్చార్జి సీపీ ప్రవీణ్ కుమార్ పర్యవేక్షణలో బలగాలు బందోబస్తులో నిమగ్నమయ్యాయి. కేటీఆర్ ప్రత్యేక సెక్యూరిటీతోపాటు నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలకు చెందిన ఏసీపీలు-5, సీఐలు, ఆర్ఐలు-29, ఎస్సైలు-76, ఏఎస్సైలు-70, హెడ్ కానిస్టేబుళ్లు -100, కానిస్టేబుళ్లు -280, మహిళా, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు -75, హోంగార్డులు-110తో పాటు ఇతర సిబ్బంది సుమారు 800 మంది బందోబస్తు నిర్వహించారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని హెలీప్యాడ్ ఏరియాను మంగళవారం నుంచే పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కలెక్టరేట్ పరిసర ప్రాంతాలను బాంబ్, డాగ్‌స్కాడ్ టీమ్స్ క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. ప్రజాప్రతినిధులు తప్ప ఎవరూ హెలీప్యాడ్ వద్దకు రాకుండా రోప్ పార్టీ బలగాలు కట్టుదిట్టమైన బందోబస్త్ నిర్వహించాయి. మంత్రి వెంట ఆయన పీఎస్వో(పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్)లు ప్రత్యేక నిఘాతో భద్రత నిర్వహించారు. ప్రత్యేక వాహనంలో మంత్రి కేటీఆర్ పర్యటించిన ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టంగా నిర్వహించారు. అంతేకాకుండా మొబైల్ పెట్రోల్ పార్టీలు, మఫ్టీ బలగాలు నగరంలోని ప్రతి ఏరియాలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు.
పాలిటెక్నిక్ ప్రాంగణం వద్ద ప్రత్యేక ‘నిఘా’
జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో మంత్రి కేటీఆర్ బహిరంగసభ సందర్భంగా మంగళవారం నుంచే పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సభా ప్రాంగణం వద్దకు వెళ్లే ప్రతిఒక్కరినీ మెటల్ డిటెక్టర్‌తో తనిఖీ చేసి లోనికి అనుమతించారు. నూతన కార్పొరేషన్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా కేవలం మీడియాతో పాటు ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లతో పాటు అధికారులు జారీ చేసిన పాసులు ఉన్న వారిని మాత్రమే లోనికి అనుమతించారు.
ముందస్తు అరెస్టులు
జిల్లా కేంద్రంలో కేటీఆర్ పర్యటన సందర్భంగా ప్రతిపక్ష పార్టీల నాయకులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్, పోలీస్ నిఘా వర్గాల ద్వారా సమాచారం అందింది. దీంతో కాంగ్రెస్, బీజేపీ, అనుబంధ సంఘాల నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. మంగళవారం రాత్రి నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మున్పిపల్ కార్పొరేషన్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉన్న మంత్రి కేటీఆర్‌ను అనుమతి లేకుండా కలిసేందుకు విద్యార్థి సంఘాల నాయకులు ప్రయత్నించారు. ఏఐసీఎస్యూ నాయకులు మంత్రికి వినతిపత్రాన్ని ఇస్తామంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మంత్రిని కలిసేందుకు అనుమతి లేదని, షెడ్యూల్ ప్రకారం నిర్దేశిత ప్రదేశంలోనే కలవాల్సి ఉంటుందని పోలీసులు నచ్చజెప్పినా వినకపోవడంతో వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.