నవీపేట, నవంబర్ 5: డబ్బుల పంపకంలో తేడా రావడంతో ఓ మహిళను దారుణంగా హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలో నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, నవీపేట ఎస్సై తిరుపతితో కలిసి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నవీపేట మండలంలో ని మద్దేపల్లి గ్రామానికి చెందిన శ్యామల లక్ష్మి (42), ఫకీరాబాద్, మద్దెపల్లి గ్రామాలకు చెందిన సంగీత, పద్మ, మంగలి బాబు కలిసి మెలిసి ఉంటూ వివిధ పనులు చేసుకుంటున్నారు.
వీరు పనిచేయగా వచ్చే డ బ్బులను సరిసమానంగా పంచుకోగా, పం పకాల్లో లక్ష్మితో తేడాలు వచ్చాయి. దీంతో లక్ష్మితో ఎలాగైనా తెగతెంపులు చేసుకోవాలనే ఉద్దేశంతో ఆమె హత్యకు సంగీత, పద్మ, బాబు పథకం పన్నారు. అక్టోబర్ 24 వ తేదీన రాత్రి లక్ష్మికి ఫుల్లుగా తాగించి, ఫత్తేనగర్ శివారులో సంగీత, మంగళి బాబు, పద్మ సాయంతో గొంతు నులిమి హత్యచేశారు. ఆనవాళ్లు కనిపించకుండా మృతదేహంపై పెట్రోల్ పోసి దహనం చేశారు. మృతురాలి సోదరి పోసాని ఫిర్యా దు మేరకు నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు.
కేసును పలు కోణాల్లో పరిశోధించిన పోలీసులు .. సంగీత, మంగళి బాబు, పద్మను నిందితులుగా గుర్తించి, వారిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వారిని రి మాండ్కు తరలించినట్లు ఏసీపీ పేర్కొన్నారు. హత్య కేసును త్వరగా ఛేదించిన ఎస్సై తిరుపతి, యాదగిరిగౌడ్, రాజశేఖర్, ఏఎస్సై గఫార్, క్రైం టీం రాజశ్వేర్, సిబ్బందిని ఏసీపీ రాజ వెంకటరెడ్డి అభినందించారు.