Nizamabad | వినాయక్ నగర్, సెప్టెంబర్ 24 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక టీం తనిఖీలు నిర్వహించింది. మహారాష్ట్ర ప్రాంతాల నుండి నిజామాబాద్ జిల్లాకు అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు సోదాలు నిర్వహించారు. కంటేశ్వర్ బైపాస్ రోడ్డు ప్రాంతంలో మహారాష్ట్ర వైపు నుండి వస్తున్నకారును స్పెషల్ టీం పోలీసులు తనిఖీ చేశారు.
దీంతో ఆ కారులో అలాంటి బిల్లు, అనుమతి లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఒక కిలో బంగారాన్ని పోలీసులు గుర్తించారు. అయితే జిల్లాకు చెందిన సంబాజీ అనే వ్యక్తి తన స్నేహితుడితో కలిసి మహారాష్ట్ర నుండి ఈ బంగారాన్ని తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఏసీపీ స్పెషల్ టీం, పట్టుబడిన వారిని బంగారంతో పాటు సంబంధిత మూడో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై హరిబాబుకు అప్పగించారు.
బంగారాన్ని తరలిస్తున్న వారి వద్ద అనుమతులు ఉన్నాయా..? కొనుగోలు చేసిన ప్రాంతం నుండి బిల్లులు పొందారా..? లేక అక్రమంగా తరలస్తున్నారా..? అనే కోణంలో దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. ప్రస్తుతం బంగారం ధర ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో మరింత భారీగా బంగారం ధర పెరిగే అవకాశం ఉన్నట్లుగా జరుగుతున్న ప్రచారంలో భాగంగా సంబాజీ అనే వ్యక్తి మహారాష్ట్ర ప్రాంతం నుండి తక్కువ ధరకు బంగారాన్ని కొనుగోలు చేసి నిజామాబాద్ జిల్లాకు తరలిస్తున్నట్లుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.