నిజామాబాద్, ఆగస్టు 08, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత చలాన్లు జారీ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదటగా నిజామాబాద్ నగర వ్యాప్తంగా అన్ని కూడళ్లలో ఏఐ ఆధారిత కెమెరాల బిగింపునకు కసరత్తు షురూ అయ్యింది. ఆటోమెటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ పేరుతో ఈ అధునాతన సాంకేతికతను వినియోగించబోతున్నారు. ఇందులో భాగంగా బైపాస్ జంక్షన్ వద్ద ప్రయోగాత్మకంగా ఏర్పాట్లు షురూ అయ్యాయి.
ఏఐ ఆధారిత కెమెరాల ద్వారా వాహనాదారులపై జరిమానాలు విధించేలా పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు మూల మలుపుల్లో, సందు గొందుల్లో దాక్కుంటూ వాహనాదారులను పోలీసులు పట్టుకుంటున్నారు. లేదంటే సిగ్నల్ వద్ద వెనుక భాగం నుంచి సెల్‌ఫోన్, డిజిటల్ కెమెరాల్లో ఫొటోలు తీసి కంప్యూటర్లో వాటిని నిక్షిప్తం చేసి చలాన్లు పంపిస్తున్నారు. ఏఐ కెమెరాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత పోలీసుల ప్రమేయం ఏమీ ఉండబోదు. ఆటోమెటిక్‌గానే నిబంధనలను ఉల్లంఘించిన వాహనాదారుల ఫొటోలను ఏఐ తీసేసుకుంటుంది.
పోలీస్ కంట్రోల్ రూమ్‌లోని సర్వర్‌కు వాటిని పంపుతుంది. వాటి ఆధారంగా ఒకరు లేదా ఇద్దరు సదరు ఫొటోల ఆధారంగా ప్రాసెస్‌ను ముందుకు కానిస్తారు. నిమిషాల వ్యవధిలో చకచక జరిమానాల పర్వం సాగుతుంది. ఒక సిగ్నల్ దాటి మరో సిగ్నల్‌కు చేరుకునేలోపే ఉల్లంఘనకు సంబంధించి జరిమానా చలాన్‌ను వాహనాదారుడి ఆర్టిఫిషియెల్ ఇంటిలిజెన్స్ వ్యవస్థ పంపిస్తుంది. సిగ్నల్ జంపింగ్, ట్రిబుల్ రైడింగ్, హెల్మెట్ లేకపోవడం, వేగంగా వాహనం నడపడం, సెల్‌ఫోన్ డ్రైవింగ్, సీట్ బెల్టు పెట్టుకోకపోవడం వంటి వాటిని ఏఐ చాకచక్యంగా గుర్తిస్తుంది.
మోటార్ వెహికిల్ యాక్ట్ ప్రకారం నిబంధనలు ఉల్లంఘించే వాహనాదారులపై జరిమానాల విధింపునకు ఇప్పటి వరకు ఆయా ఠాణాలకు పోలీస్ ఉన్నతాధికారులు టార్గెట్ విధించారు. ఫలితంగా ఉదయం 10గంటల తర్వాత చేతిలో మొబైల్ ఫోన్, డిజిటల్ కెమెరాలు ధరించి పోలీసులు ఎడాపెడా జరిమానాలు విధిస్తున్నారు. ఏఐ కెమెరాల పనితనం షురూ అయితే పోలీసులకు శాంతి, భద్రతలపైనే పూర్తిగా దృష్టి సారించే వీలు కలుగనుంది. ట్రాఫిక్ ఉల్లంఘనలను ఏఐ కెమెరాలతోనే నడిపించడం ద్వారా పోలీసులతో భౌతికంగా అవసరం ఉండదు. ఇప్పటి వరకు ప్రతి ఠాణాలో రోజుకు 100 చొప్పున జరిమానాలు విధిస్తున్నారు.
గంట సేపు సరదాగా ఆడుకుంటూ పాడుకుంటూ ఫొటోలు తీసి వాటిని అప్లోడ్ చేయడం పెద్ద ప్రాసెస్‌గా మారింది. ఏఐ వచ్చాక ఇదంతా ఉండబోదు. తెలిసినోళ్లను వదిలేయడం, స్టిక్కర్లు ధరించి తిరిగే వ్యక్తులను పట్టుకోకపోవడం వంటివేవి ఏఐ కెమెరాల ముందు పని చేయవు. నిబంధనలు ఉల్లంఘిస్తే టక్కున ఫొటో తీసి చలాన్ పంపించడమే ఉంటుంది. చలాన్లు వేల సంఖ్యలో సులభంగా పంపించే సౌకర్యం ఏర్పడటంతో భారీగా జరిమానాల రూపంలో పోలీస్ శాఖకు ఆదాయం సమకూరే అవకాశం కూడా ఏర్పడబోతోంది. జరిమానాలు వేస్తున్నారంటేనే వాహనాదారులు ఏదో రకంగా పోలీసులను బురిడీ కొట్టించి తప్పించుకుంటున్న దాఖలాలు ఉండేవి. ఏఐ వచ్చాక అలాంటి పరిస్థితి ఉండే అవకాశం లేదని పోలీసులు భావిస్తున్నారు. తప్పు చేసిన వారికి కచ్చితంగా శిక్ష పడుతుందని ఖాకీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మోటార్ వెహికిల్ యాక్ట్ నిబంధనల ఉల్లంఘన పేరుతో పోలీసులు ఎడాపెడా ప్రజలపై జరిమానాలు విధిస్తున్నారు. అయినప్పటికీ ప్రజలకు అవగాహన రావడం లేదు. ఒకసారి జరిమానా విధిస్తే మరోసారి వాహనాదారుడిలో మార్పు రావాల్సి ఉండగా అలాంటిదేమీ కనిపించడం లేదు. పోలీసులు సైతం అవగాహన చర్యలు గాలికి వదిలేసి కేవలం చలాన్లు జారీపైనే దృష్టి సారించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన నాలుగు నెలల కాలంలో వాహనాదారులపై విపరీతంగా చలాన్లు జారీ చేశారు. 2025 ఏప్రిల్ నుంచి జూలై నెలాఖరు వరకు హెల్మెట్ లేకపోవడంపై 1లక్షా 3వేల కేసులు నమోదు చేశారు. దీని దవారా రూ.1.74కోట్లు జరిమానాలు జారీ అయ్యాయి.
16,072 ఓవర్ స్పీడ్ కేసులకు రూ.1.60కోట్లు విధించారు. 260 సౌండ్ పొల్యూషన్ కేసులకు రూ.2.56లక్షలు, ట్రిబుల్ డ్రైవింగ్ 2376 కేసులు పట్టుబడగా రూ.28.16లక్షలు జరిమానాలు మోపారు. 79 సిగ్నల్ జంప్ కేసులు వెలుగు చూశాయి. డ్రంక్ డ్రైవ్ కేసులు 6వేలు నమోదు కాగా కోర్టుల ద్వారా జైలు శిక్షలు పడే విధంగా పోలీసులు ప్రయత్నాలు చేసతున్నారు. మైనర్ డ్రైవింగ్ కేసులు 539 నమోదు కాగా రూ.73వేలు పెనాల్టీ విధించారు. 14,021 నో పార్కింగ్ చలాన్లు జారీ కాగా జరిమానా మొత్తం విలువ రూ.56.65లక్షలుగా ఉంది. రాంగ్ సైడ్ డ్రైవింగ్ 1063 కేసులకు రూ.2.62లక్షలు పెనాల్టీ విధించారు. సెల్‌ఫోన్ డ్రైవింగ్ 1034 కేసుల్లో రూ.10. 34లక్షలు మేర జరమానా విధించారు.
సీపీ సాయి చైతన్య ఆదేశాలతో నిజామాబాద్ నగరంలో ఏఐ ఆధారిత కెమెరాల వినియోగం చేపట్టబోతున్నాము. రాత్రి, పగలు తేడా లేకుండా నిబంధనలు ఉల్లంఘించే వారిని గుర్తించి చలాన్లు జారీ చేయడం జరుగుతుంది. వాహనాదారుల్లో మార్పు తీసుకు రావడం, రోడ్డు ప్రమాదాలను నివారించడం కోసం ఈ విధానాన్ని తీసుకు వస్తున్నాము. ప్రజలంతా సహకరించాలని కోరుతున్నాము.
– మస్తాన్ అలీ, ఏసీపీ, ట్రాఫిక్ విభాగం