వినాయక్‌నగర్, డిసెంబర్ 20: సమావేశానికి ఆలస్యంగా వచ్చిన ఎస్సైలకు మరిచిపోలేని పనిష్మెంట్ ఇచ్చారు నిజామాబాద్ ఇన్చార్జి సీపీ సింధూశర్మ. పోలీసు గ్రౌండ్ చుట్టూ ఐదు రౌండ్లు రన్నింగ్ చేయించారు. వారం క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే.. ఇన్చార్జి సీపీ సింధూశర్మ వారం క్రితం జిల్లా పోలీసు సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలోని ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు సకాలంలో రావాలని సూచించారు.
అయితే, నలుగురు ఎస్సైలు సమావేశం ప్రారంభమైన తర్వాత హాల్లోకి చేరుకున్నారు. మీటింగ్‌కు ఆలస్యంగా రావడాన్ని సీరియస్‌గా పరిగణించిన ఇన్చార్జి సీపీ ఊహించని రీతిలో వారికి శిక్ష విధించారు. పోలీసు పరేడ్ గ్రౌండ్ చుట్టూ ఐదుసార్లు రన్నింగ్ చేసి రావాలని ఆదేశించారు. వారు పరుగు పూర్తి చేసేలా పర్యవేక్షించాలని ఆర్‌ఎస్సైలకు సూచించారు. ఇక తప్పదని ఆ నలుగురు ఎస్సైలు గ్రౌండ్ చుట్టూ ఐదుసార్లు రన్నింగ్ పూర్తి చేసి, ఆ తర్వాత సమావేశానికి హాజరయ్యారు. మరోసారి ఇలా చేస్తే సహించేది లేదని ఇన్చార్జి సీపీ హెచ్చరించినట్లు తెలిసింది. పోలీసు శాఖలో పని చేసే వారు క్రమశిక్షణతో పాటు సమయ పాలన తప్పనిసరిగా పాటించాలని, లేకపోతే క్రమశిక్షణ వేటు పడుతుందని స్పష్టం చేసినట్లు సమాచారం.