ధర్పల్లి, ఏప్రిల్ 24: ఆరు గ్యారంటీల అమలుపై ప్రశ్నించినందుకు పోలీసులు చితకబాదారని బాధితుడు వాపోయాడు. ధర్పల్లి మండలంలోని నడిమి తండాలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే భూపతిరెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా జగదాంబ ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయనను గిరిజనులు సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేశామని చెప్పారు.
ఈ క్రమంలో హామీలు అందరికీ అమలు కాలేదని అక్కడే ఉన్న బనావత్ బన్నాజీ ప్రశ్నించాడు. దీంతో నలుగురు పోలీసులు అతడ్ని పక్కకు తీసుకెళ్లారు. ప్రశ్నించినందుకు పోలీసులు తనను కొట్టారని, ధర్పల్లి సీఐ నడుము, చెంపపై రెండు దెబ్బలు వేశారని బన్నాజీ వాపోయాడు. ఏం తప్పు చేశానని తనను కొట్టారని ప్రశ్నించాడు. బాధితుడి ఆరోపణలపై ధర్పల్లి సీఐ భిక్షపతిని వివరణ కోరగా.. ఎవరినీ కొట్టలేదని చెప్పారు. ఎవరిపైనా తమకు కక్షలుండవని, ఎమ్మెల్యే కార్యక్రమం నడుస్తున్నందున అతడ్ని అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లామని వివరించారు.