భీమ్‌గల్/ మోర్తాడ్/ ఏర్గట్ల/ బాల్కొండ/వేల్పూర్, ఏప్రిల్ 17: జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి భీమ్‌గల్ పర్యటనలో బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి సునీల్‌రెడ్డి పోద్బలంతోనే దాడులు జరిగాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించినందుకే పోలీసులతో దాడులు చేయించి, తమ నాయకులు, కార్యర్తలను తీవ్రంగా గాయపరిచారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దాదాపు 30మంది బీఆర్ఎస్ కార్యకర్తలు గాయపడ్డారని, ఈ దౌర్జన్య కాండను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ప్రశ్నిస్తే దాడులు చేయడమేనా.. ఇదేనా కాంగ్రెస్ ప్రజాపాలన అని ప్రశ్నించారు. లాఠీలకే కాదు తూటాలకూ తాము వెరబోమని స్పష్టం చేశారు.
గురువారం వేల్పూర్, భీమ్‌గల్,మోర్తాడ్, బాల్కొండ, ఏర్గట్ల తదితర మండలాల్లో స్థానిక బీఆర్ఎస్ నాయకులు విలేకరుల సమావేశాలు ఏ ర్పాటు చేసి మాట్లాడారు. భీమ్‌గల్‌లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ చేయడానికి వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావును వేదికపై మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తులం బంగారం ఇచ్చి ఆడబిడ్డలను ఆదుకోవాలని సామరస్య పూర్వకంగా అడిగితే.. కాంగ్రెస్ గూండాలు చొచ్చుకు వచ్చి దాడులకు తెగబడ్డారన్నారు.
నిష్పక్షపాతంగా డ్యూటీ చేయాల్సిన పోలీసులు అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారి బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీచార్జీ చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ గొడవలకు కాంగ్రెస్ పార్టీ నియోజక ఇన్చార్జి సునీల్ రెడ్డే మూలకారణమని ఆరోపించారు. పథకం ప్రకారమే అనుచరులను పురమాయించి దాడు లు చేయించారన్నారు. పోలీసులకు తమ నాయకులను ఏరికోరి చూపుతూ దగ్గరుండి లాఠీచార్జీ చేయించారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భీమ్‌గల్ మండలంలో మెజారిటీ రాకుండా చేసి ఓటమికి కారణమైనందుకు, ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడితే ఎండగట్టినందుకు కక్ష పెంచుకున్నాడని మండిపడ్డారు. ఈ దాడులకు కారణమైన సునీల్‌రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీ వారసత్వ సంస్కృతి అని విమర్శించారు.
కొందరు పోలీసు అధికారులు కాంగ్రెస్ నాయకులకు తొత్తుగా మారుతున్నారని, వారు తమ పద్ధతిని మార్చుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీచార్జి చేసిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లావ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ శ్రేణులపై దాడులకు పాల్పడిన కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు నమోదు చేయాలని పోలీసుల ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు.