వినాయక్‌నగర్, జూన్ 8: జిల్లాలో మైనర్ డ్రైవింగ్‌పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో ర్యాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవర్లు అధిక సంఖ్యలో పట్టుబడుతున్నారు. మైనర్లు బైకులు, కార్లు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించినా కొందరిలో మార్పురావడంలేదు. మైనర్లు వాహనాలు నడపడంవల్ల వారితోపాటు ఎదుటి వ్యక్తులకు సైతం హాని జరుగుతున్నది.
ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన సీపీ సాయి చైతన్య .. మైనర్ డ్రైవింగ్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు. డ్రైవింగ్ చేస్తూ మైనర్లు పట్టుబడితే వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయకుండా అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆదేశించినట్లు తెలిసింది. అవగాహనలో భాగంగా సామాజిక సేవ చేయిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన జంక్షన్స్ (సిగ్నల్ పాయింట్స్)వద్ద పట్టుబడిన మైనర్లతో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సామాజిక సేవ చేయిస్తున్నారు.
మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు బ్రేక్ ఇస్తున్నారు. మైనర్స్ డ్రైవింగ్ చేయడం చట్టరీత్యా నేరమని, మైనర్లు వాహనం నడపడంవల్ల మనతోపాటు ఎదుటి వ్యక్తులకు సైతం హాని కలుగుతుందని, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే ప్రాణహాని కలుగుతుందని, ప్రతి ఒక్కరూ తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని పేర్కొంటూ రూపొందించిన ఫ్లకార్డులను చేతుల్లో పట్టుకుని అవగాహన (సామాజిక సేవ) కల్పిస్తున్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఐదు ప్రధాన కూడళ్ల వద్ద పలువురు మైనర్లు ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణలో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.