ఉమ్మడి జిల్లాలో తరచూ ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనాలు ఢీకొని, తలకు బలమైన గాయాలై మృత్యువాత పడుతున్నా రు. వీరు హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణ నష్టం తప్పేది. ఈ విషయంపై ద్విచక్రవాహనదారులకు అవగాహన ఉన్నా ..హెల్మెట్ ధరించడంపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రమాదం జరిగితే తప్ప హెల్మెట్ ఎంత ముఖ్యమో తెలిసి రావడంలేదు.
ఈ నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో హెల్మెట్‌ధారణ కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నారు. సీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పి.సాయి చైతన్య ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఇప్పటికే మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. హెల్మెట్ వాడకాన్ని కచ్చితంగా అమలుచేయడంతోపాటు నాణ్యమైన హెల్మెట్లు మాత్రమే వాడాలంటూ పోలీసులు సూచిస్తున్నారు.
-నిజామాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
శిరస్ర్తాణం ధరించే వాహనదారులకు జరిమానా విధించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా గ్రామాల్లో హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ వాహనదారుల్లో మార్పు కనిపించడంలేదు. హెల్మెట్ ఉన్నా ధరించకుండా ప్రయాణాలు చేస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇలా ఉమ్మడి జిల్లాలో రోడ్డు ప్రమాదాల్లో తలకు బలమైన గాయాలై మృతి చెందిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో హెల్మెట్‌ను తప్పసరి చేస్తూ, ప్రతి ఒక్కరూ ధరించేలా పోలీసు శాఖ చర్యలు తీసుకోనున్నది. పోలీసుల నిర్ణయాన్ని ప్రజలంతా స్వాగతిస్తున్నప్పటికీ ప్రస్తుతం మార్కె ట్లో నాణ్యమైన హెల్మెట్లు అందుబాటులో లేవు.
బొటాబొటిగా ఉన్న దుకాణాల్లో కనీస ప్రమాణాలు పాటించనివే ఎక్కువగా విక్రయిస్తున్నారు. ఐఎస్ఐ మార్క్ ఉన్న హెల్మెట్లు కనిపిస్తున్నప్పటికీ అవన్నీ ఫేక్ ముద్రణతో తయారు చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హెల్మెట్ కోసం రూ.వెయ్యి వరకు వెచ్చించే వాహనాదారులకు విక్రయదారులు కుచ్చుటోపి పెడుతున్నారు. నకిలీ హెల్మెట్ పేరుతో త్వరలో పోలీసులు డ్రైవ్ కొనసాగించే అవకాశాలు ఉండడంతో ఏది నకిలీ .. ఏది ఒరిజినల్ హెల్మెట్ అనేది ఎలా తెలుసుకోవాలో తెలియక సామాన్యులు తలలు పట్టుకుంటున్నారు. మార్కెట్లో నాణ్యమైన హెల్మెట్లు అందుబాటులోకి తీసుకురావడంతోపాటు నకిలీ హెల్మెట్ల విక్రయదారులను నిరోధించాలని పోలీసులను ప్రజలు కోరుతున్నారు.
గతంలో కరీంనగర్లో సీపీగా కమలాసన్ రెడ్డి సుదీర్ఘ కాలం పని చేశారు. హెల్మెట్ వినియోగంపై డ్రైవ్ నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించని వారిని పట్టుకుని కలిగే నష్టాన్ని వివరించారు. నకిలీ హెల్మెట్లను పట్టుకుని స్వయంగా ధ్వంసం చేశారు. పోలీసుల భయంతో పైపై హెల్మెట్లను ధరిస్తే వాటిని అనుమతించలేదు. ఇలా ఒకటికి పది సార్లు రోడ్డుపైకి వచ్చి సీపీగా కమలాసన్ రెడ్డి చేసిన కృషితో రాష్ట్రంలోనే హెల్మెట్ వాడకం లో కరీంనగర్ జిల్లా ప్రశంసలు అందుకున్న ది.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో గతేడాది ఆగస్టు 15 నుంచి హెల్మెట్ డ్రైవ్ కచ్చితంగా అమలు చేస్తామంటూ అప్పటి సీపీ కల్మేశ్వర్ ఆదేశాలిచ్చారు. కానీ ఇది అమలుకాలేదు. పోలీసులే హెల్మెట్ వాడకాన్ని సీరియస్‌గా తీసుకోకపోవడంతో గత సీపీ ఆదేశాలు బుట్ట దాఖలయ్యాయి. గత్యంతరం లేక హె ల్మెట్ ధారణను మధ్యలోనే నిలిపేసి పైపైనే జరిమానా విధించి చే తులు ఎత్తేశారు. హె ల్మెట్ డ్రైవ్‌ను కేవలం ట్రాఫిక్ విభాగానికే పరిమితం చేయడంతో ప్రతిసారి ఈ కార్యక్రమం నీరుగారిపోతున్నది.
వీఐపీ టూర్లు, ట్రాఫిక్ ఇబ్బందులను సరి చేయడానికే ట్రాఫిక్ పోలీసులకు సమయం సరిపోకపోవడంతో శిరస్ర్తాణంపై దృష్టి పెట్టడం కత్తిమీద సాములా మారింది. ప్రజల్లో మార్పు కోసం చేపట్టే ఈ కార్యక్రమా న్ని తూతూ మంత్రంగా మార్చకూడదంటూ ప్రజల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఐఎస్ఐ మార్క్‌తో కూడిన నాణ్యమైన హెల్మెట్లు అందుబాటులోకి తీసుకు రావడం, కచ్చితంగా హెల్మెట్ వినియోగంపై వాహనాదారులను మరింత చైతన్యపర్చడాన్ని ఉద్యమంగా ముందుకు తీసుకు రావాలని సీపీ సాయి చైతన్యను జిల్లా వాసులు కోరుతున్నారు.
నిజామాబాద్ మార్కెట్లో నాణ్యమైన హెల్మెట్లు లభించడం లేదు. ఆటోమొబైల్ కంపెనీల్లోనూ మోసాలు కనిపిస్తున్నాయి. ప్రైవేటు దుకాణాల్లో నాణ్యమైన హెల్మెట్లు పత్తాలేకుండా పోయా యి. పోలీసుల జరిమానాల భయంతో గ్రామీ ణ ప్రాంతాల నుంచి వస్తున్నవారు శిరస్ర్తాణాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. కొత్త బైక్‌లను కొన్నప్పుడు ఇచ్చే హెల్మెట్లు నాణ్యంగా, ఐఎస్ఐ మార్క్ ముద్రితంగా కొన్ని మాత్రమే ఉంటున్నాయి. మిగితావి నాణ్యమైనవి లేకపోవడంపై వాహనాదారులు ఇబ్బంది పడుతున్నారు. తక్కువ క్వాలిటీ కలిగిన హెల్మెట్లను అధిక ధరలకు విక్రయిస్తూ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులపై పోలీసులు కన్నెత్తి చూడడం లేదు.
జిల్లా కేంద్రంలో తిరుమల టాకీస్ రోడ్డు, నెహ్రూ చౌక్, గాంధీ చౌక్, బోధన్ రోడ్డు, అర్సపల్లి, వినాయక్‌నగర్‌లో హెల్మెట్ దుకాణాలున్నాయి. వీటిల్లో అడపాదడపా దాడులు నిర్వహిస్తే హెల్మెట్ల బాగోతం బట్టబయలవుతుందని ప్రజలు కోరుతున్నారు. బోధన్, ఆర్మూర్ పట్టణాల్లోనూ విచ్చలవిడిగా అమ్మకాలు కొనసాగుతున్నాయి. వీటిల్లో ఐఎస్ఐ ప్రమాణాలతో కూడినవి లేవన్నది ప్రధాన ఆరోపణ.