నిజామాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగేనావర్ బదిలీ కానున్నట్లు ప్రచారం జరుగుతున్నది. తాము చెప్పిన మాట వినడం లేదని, బదిలీల విషయంలోనూ సహకరించడం లేదని కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సీపీని ట్రాన్స్ఫర్ చేయాలని నేతలు సీఎంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆయన బదిలీకి రంగం సిద్ధమైనట్లు సమాచారం. అయితే, రెండు నెలల క్రితం కూడా సీపీని కదుపుతారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, అనూహ్యంగా కల్మేశ్వర్ భార్య ప్రియదర్శినిని 7వ బెటాలియన్ కమాండెంట్‌గా నియమించడంతో ఆ ప్రచారానికి బ్రేక్ పడింది. తాజాగా మరోసారి బదిలీ అంశం తెరపైకి వచ్చింది.
ముక్కుసూటి మనిషిగా, శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ లేకుండా వ్యవహరిస్తున్న సీపీ తీరు కొందరు నేతలకు నచ్చడం లేదు. పలు సందర్భాల్లో కీలక నేతల మాటలను ఆయన పక్కన పెట్టడం వారిని ఆగ్రహానికి గురి చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన మాకు వద్దే వద్దంటూ ప్రభుత్వ పెద్దలకు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి మాటలకు, క్షేత్ర స్థాయిలో చేతలకు భారీ తేడా కనిపిస్తున్నది. సిఫార్సు లేఖలతో వస్తే పోస్టింగ్‌లు ఇవ్వొద్దని ఆదేశించారు. అదే పనిని పోలీస్ ఉన్నతాధికారులు చేపడితే కాంగ్రెస్ నేతలు గుగ్గిలమవుతున్నారు. ఐపీఎస్ అధికారులతో గొడవకు దిగుతున్న ఘటనలు జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్య జరిగిన ఎస్సై, సీఐ బదిలీల వ్యవహారమే ఇందుకు నిదర్శనం. రూరల్ నియోజకవర్గంలోని ఎస్సైలు, సీఐలకు పోస్టింగ్ విషయాల్లో ఉత్తర్వులు జారీకాగా, అవి అమలు కాలేదు. ఆర్మూర్, భీమ్‌గల్ సీఐల మార్పు విషయంలోనూ ఇదే జరిగింది. గంటల్లో ఉత్తర్వులు మారాయి. ఇది అధికార పార్టీ నేతల్లో మంట రాజేసింది. నెల క్రితం కూడా నలుగురు సీఐలకు స్థాన చలనం కాగా, రాత్రికి రాత్రే ఉత్తర్వులు ఆగిపోయాయి. మూడు రోజుల క్రితం అవే ఉత్తర్వులను తేదీ మార్చుతూ అమలు చేయడం ముక్కున వేలేసుకునేలా చేసింది.
ఇందులో ఒకరిద్దరిపై తీవ్రమైన ఆరోపణలున్నప్పటికీ కీలకమైన పోస్టింగ్‌లు దక్కడం చర్చకు దారి తీసింది. రూరల్ నియోజకవర్గంలో ఓ మండల స్థాయి నాయకుడి వాహనాన్ని పట్టుకోగా విడిచిపెట్టాలంటూ పెద్దల నుంచి ఫోన్లు వచ్చినా పోలీసులు విడిచి పెట్టలేదు. మోపాల్‌లో ఓ ప్రజాప్రతినిధి ట్రాక్టర్ల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కువ వాహనాలను అనుమతించేది లేదంటూ స్పష్టం చేశారు. ఆయా ఘటనలతో కంగుతిన్న నేతలు సీఎం రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఫలితంగా సీపీని బదిలీ చేసేందుకు ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. మరోవైపు పోలీస్ బాస్‌కు ఓ ప్రజాప్రతినిధి అండగా నిలుస్తుండగా, మరో నాయకుడు బదిలీ చేయాల్సిందేనని పట్టుబడుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది.