నిజామాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రేవంత్ సర్కారు నియంతృత్వ పోకడలకు పోతున్నది. అక్రమ నిర్బంధాలు, అరెస్టులతో నిరంకుశ పాలన కొనసాగిస్తున్నది. ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులను చట్టసభల్లోకి వెళ్లకుండా సోమవారం అడ్డుకున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాజీ సర్పంచులను అక్రమంగా అరెస్టు చేయించి ఠాణాల్లో నిర్బంధించింది. ప్రజాపాలన పేరు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ.. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న తీరుపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రజాస్వామ్యమని, ప్రజా పాలన అని ఊదరగొట్టింది. తీరా చూస్తే కనీసం శాంతియుత నిరసనలు చేపట్టే అవకాశం లేకుండా చేసింది. ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ నేతలే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం, వారికే ప్రభుత్వ యంత్రాంగం వత్తాసు పలకడం దగ్గరి నుంచి
మొదలు పెడితే చట్టసభల్లోకి అడుగు పెట్టనీయకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను నిర్బంధించడం వరకు సర్కారు నిరంకుశత్వానికి చక్కటి ఉదాహరణ. మరోవైపు, బీఆర్ఎస్ నేతలను అడ్డగించిన ప్రభుత్వం.. బీజేపీ ఎమ్మెల్యేలను మాత్రం సభలోకి అనుమతించడం గమనార్హం.
పైగా అసెంబ్లీలో మైక్ ఇచ్చి ఇష్టారీతిన మాట్లాడేందుకు అవకాశం కల్పించింది. బీజేపీ ఎమ్మెల్యేల పట్ల ఒకరకంగా, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో మరో విధంగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశమైంది. అసెంబ్లీ సమావేశమైన తొలి రోజున ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రొటోకాల్ వివాదంపై సభ దృష్టికి తీసుకొచ్చారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సైతం ఇదే అంశంతో పాటు ఇతరత్రా సమస్యలను లేవనెత్తారు. బీజేపీ ఎమ్మెల్యేలు మాట్లాడేందుకు సభాపతి అవకాశం కల్పించడంతో పాటు వారిని ఎక్కడా పోలీసులు అడ్డుకోలేదు. కానీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సభలోకి అనుమతిస్తే తమ తప్పులను ఎత్తి చూపి నిప్పులు చెరుగుతారనే భయంతో ప్రభుత్వం అక్రమ నిర్బంధాలకు తెరలేపింది.
రాజధానిలో స్వయంగా అసెంబ్లీ ఎదుటే ప్రజాస్వామ్య విలువలను కాలరాసిన సర్కారు.. ఉమ్మడి జిల్లాలోనూ అలాగే వ్యవహరించింది. మాజీ సర్పంచులను సోమవారం ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచులు ఎన్నిసార్లు విన్నవించినా రేవంత్ సర్కారు స్పందించలేదు. దీంతో చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. అయితే, ప్రభుత్వం మాజీ ప్రజాప్రతినిధులు గడప దాటకుండా పోలీసులతో ఎక్కడికక్కడ కట్టడి చేసింది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు గ్రామాల్లోకి వచ్చిన పోలీసులు మాజీ సర్పంచులను అదుపులోకి తీసుకున్నారు. నిద్ర పోతున్న వారిని సైతం లేపి మరీ ఠాణాలకు తీసుకెళ్లారు.
మరికొందరిని గృహ నిర్బంధం చేశారు. సర్కారు నిరంకుశ వైఖరిపై మాజీ ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యమంటే ఆంక్షలు విధించడమేనా? అక్రమంగా నిర్బంధించడమేనా? అని ప్రశ్నించారు. రౌడీ మూకలను, సంఘ విద్రోహులను అరెస్టు చేసినట్లు తమను అరెస్టు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులుగా చలామణి అవుతున్న బడా కాంట్రాక్టర్లకు వేల కోట్లు బిల్లులు మంజూరు చేస్తున్న రేవంత్ ప్రభుత్వం తమను కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా రూ.150 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లుగా సమాచారం.
చట్టసభల్లో జనం గొంతుక వినిపించే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అక్రమంగా అరెస్టు చేసింది. ఈ నెల 9 నుంచి మొదలైన అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా సభకు హాజరయ్యేందుకు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు దౌర్జన్యంగా నిర్బంధించారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలపై ప్రశ్నించేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ నేతలను అసెంబ్లీ బయటే అడ్డుకున్నారు. గతంలో ఎన్నడూ ఈ తరహాలో నిర్బంధాలు జరుగలేదు.
సభా వ్యవహారాలకు అడ్డు పడితే సస్పెండ్ చేయడం సాధారణం కానీ, సభలోకి అడుగు పెట్టకుండానే అడ్డుకోవడం విమర్శలకు తావిచ్చింది. మరోవైపు, అసెంబ్లీకి వస్తే ప్రజా సమస్యలపై చర్చిద్దామని సవాల్ చేస్తున్న రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్ష నేతలను అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా నిర్బంధించిన వైనంపై జోరుగా చర్చ జరుగుతున్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.