నస్రుల్లాబాద్, అక్టోబర్ 9: తెలంగాణ వచ్చాకే మనకు మంచి రోజులు వచ్చాయని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని దుర్కి గ్రామంలో రూ.20 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను సోమవారం ప్రారంభించారు. అనంతరం దుర్కి ప్రధాన రహదారి వద్ద ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు అంకోల్ క్యాంపు గ్రామంలో కుమ్మరి సంఘ భవనానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడారు. ఉమ్మడి ఏపీలో ఉన్నపుడు తెలంగాణ ప్రాంత ప్రజలు వారికి అవసరమైన పనుల కోసం నిధులు అడిగితే తాము ఇవ్వలేక ఇబ్బందులు పడేవాళ్లమని తెలిపారు.నిధుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగేవారిమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే ఆదాయంలో నుంచే తిరిగి మన అభివృద్ధి కోసం కేవలం పావలా ఖర్చు పెట్టేవారని తెలిపారు. ఆంధ్ర పాలకులు నిధులను వారి ప్రాంతాలకు మంజూరు చేసుకునేవారని అన్నారు.ఈ అన్యాయాన్ని చూసి సహించలేక కేసీఆర్ 2001 లో తెలంగాణ జెండా పట్టినట్లు తెలిపారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా దాటుకుని తెలంగాణ రాష్ట్రం సాధించారన్నారు. దుర్కి గ్రామంలో రూ.5 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. తెలంగాణ వచ్చాకే ఒక్క గ్రామానికి ఇన్ని నిధులు ఇవ్వగలిగామన్నారు. గ్రామంలో అన్ని కుల సంఘాల భవనాలకు నిధులు ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలోని 78లక్షల మంది రైతులకు ఏటా రైతు బంధు పథకం ద్వారా రూ.15 వేల కోట్లను ఇస్తున్నామన్నారు.
స్వరాష్ట్రంలోనే సంక్షేమ పథకాలు
కంటి వెలుగు పథకంలో ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేయించి అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలను అందించినట్లు తెలిపారు. స్వరాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకనే సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారని చెప్పారు. గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ. 1.25 లక్షలు ఖర్చు చేస్తోందన్నారు. 75 శాతం సబ్సిడీతో యాదవులకు గొర్రెలు, వంద శాతం సబ్సిడీతో మత్స్యకారులకు చేపపిల్లలను పంపిణీ చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి, సర్పంచులు శ్యామల, రాము, విండో చైర్మన్ దివిటి శ్రీనివాస్ యాదవ్, ఎంపీటీసీ సభ్యుడు నారాయణ, మండల కో -ఆప్షన్ సభ్యుడు వాజిద్, నాయకులు కిశోర్ యాదవ్, మహేశ్, గిర్మయ్య, శంకర్, ఏడె మోహన్, నారాగౌడ్, ఖదీర్, ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.